ఎర్రచందనం దుంగలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Aug 12 2026 12:16 AM | Updated on Aug 12 2026 12:16 AM

– నలుగురి అరెస్ట్‌

చిట్వేలి: చిట్వేలి రేంజ్‌ వెంకటరాజుపల్లి బీటు, నల్గొంట ప్రాంతంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఓ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అన్నమయ్య జిల్లా డీఎఫ్‌ఓ నుంచి అందిన సమాచారం, రేంజర్‌ ధీరజ్‌ ఆదేశాల మేరకు సోమవారం సిబ్బందితో అడవిలో తనిఖీలు నిర్వహిస్తుండగా దుంగలతో ఉన్న వ్యక్తులను గుర్తించి దాడిచేసి అదుపులోకి తీసుకున్నట్టు ఎఫ్‌ఎస్‌ఓ తెలిపారు. తొమ్మిది దంగల బరువు 169 కిలోలు కాగా వాటి విలువ రూ.51,766 ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చరేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఎఫ్‌బీఓలు చెంగమ్మ, సుధాకర్‌, కరిముల్లా, డ్రైవర్‌ యశ్వంత్‌, బేస్‌ క్యాంప్‌ వాచర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

చంద్రగిరి: వెనుక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొనడంతో స్కూటరిస్టు మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పాకాలవారిపల్లి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం తెలవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పాకాల మండలం, గాదంకి గ్రామానికి చెందిన చిన్న చెన్నయ్య(50) టోల్‌ప్లాజా సమీపంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై విధులకు వస్తున్న క్రమంలో కోయంబత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్న చెన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

అనుమానంతో భార్యపై చాకుతో దాడి

చంద్రగిరి: అనుమానంతో భార్యపై భర్త చాకుతో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని దానమూర్తివారిపల్లి సమీపంలోని కొత్త ఇండ్లు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. కొత్తఇండ్లు గ్రామానికి చెందిన చెంగళ్రాయులు భార్య మున్నెమ్మ కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లింది. రెండు నెలల క్రితం మున్నెమ్మ తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇంటి వద్దే ఉంటోంది. అయితే మున్నెమ్మలో కొన్ని మార్పులు రావడంతో ఆమె భర్త చెంగళ్రాయులు ఆమెను అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మున్నెమ్మ సెల్‌ఫోన్‌లో కువైట్‌లో మరో వ్యక్తితో కలసి ఫొటోలు తీసుకోవడాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన చెంగళ్రాయులు ఇంట్లో ఉన్న చాకుతో ఆమైపె దాడికి పాల్పడ్డాడు. గాయపడిన మున్నెమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

3.5 కిలోల గంజాయి స్వాధీనం

– ఇద్దరి అరెస్ట్‌

రైల్వేకోడూరు అర్బన్‌: రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి మండలం చెర్లోపల్లి బ్రిడ్జి సమీపంలో గంజాయి తరలిస్తున్న వారిపై దాడులు చేసి మంగళవారం ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. స్థానిక కార్యాలయంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా, విక్రయం చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించి కొడూరు పట్టణం ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మొపూరి నవీన్‌కుమార్‌, ఒంగోలుకు చెందిన వాకారా మ్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్నవారిని బయటకు తీస్తామన్నారు. ఆయన వెంట సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, వినోద్‌కుమా, సిబ్బంది ఉన్నారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 81,064 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,136 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.36 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement