వైఎస్‌ఆర్‌సీపీ జోరుకు అధికార పక్షం జడుసుకుంది
నిరసన ర్యాలీ సక్సెస్ కావడంతో ఖాకీలతో కక్ష సాధింపా?
పోలీస్ స్టేషన్ ముందు
చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆగ్రహం
చంద్రగిరి: డీఎస్సీ అక్రమాలపై చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి వేలాది మంది తరలిరావడంతో అధికార పక్షం జీర్ణించుకోలేక పోతోంది. పోలీసులను ముందు పెట్టి ర్యాలీని సజావుగా నడిపించిన ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిపై కేసుల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఇలాంటి అనైతిక చర్యలకు పోలీసులు దిగజారడం సిగ్గు చేటు.. అంటూ రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతియుత ధర్నా
చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు శాంతియుత ధర్నా చేపట్టారు. గత రెండు రోజుల క్రితం చంద్రగిరి పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరిద్దరు తమ విధుల్లో భాగంగా ఖాకీ యూనిఫాం ధరించి విధులు నిర్వహించారు. ఖాకీ యూనిఫాం ధరించడం చట్ట రీత్యా నేరమైనట్టుగా ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీ వారిపై కేసు నమోదు చేయడం, అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడంతో వివాదం ముదిరింది.
సెక్యూరిటీ సిబ్బంది విడుదల
పోలీస్ స్టేషన్ ముందు కొంత సేపు ఉద్రిక్తత కొనసాగిన అనంతరం అదుపులో ఉన్న ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అధికార పార్టీ నేతల సూచనలతో కక్ష తీర్చుకునేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హర్షిత్‌రెడ్డి హెచ్చరించారు.
ప్రయివేటు సెక్యూరిటీపై కేసుల వెనుక రాజకీయ ఒత్తిళ్లు
కార్మికుడి కోసం ఎందాకైనా..!
కార్మికుడి కోసం ఎందాకైనా అంటూ.. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి దూసుకుపోయారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోలీసుల తీరును తప్పుబట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ విజయ వంతమైందనే అక్కసుతోనే పోలీసులను పావులుగా మార్చి ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు పెట్టించారన్నారు. ఖాకీ డ్రస్ వేసుకోవడమే నేరమే అయితే పంచా యతీ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఆటో డ్రైవ ర్లు, ఆర్టీసీ సిబ్బంది సైతం ఖాకీ డ్రస్ ధరిస్తారని, వారిని కూడా అరెస్టు చేస్తారా..? అంటూ హర్షిత్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమ కేసుతో తీసుకువచ్చిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.


