కక్ష సాధింపులతోనే చంపేశారు | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపులతోనే చంపేశారు

Aug 12 2026 12:16 AM | Updated on Aug 12 2026 12:16 AM

● వీడిన శ్రీకాళహస్తిలో హత్య కేసు మిస్టరీ ● నలుగురి అరెస్ట్‌, పరార్‌లో మరొకరు

తిరుపతి క్రైం : శ్రీకాళహస్తిలో సంచలనం రేపిన శివకుమార్‌ హత్య కేసు మిస్టరీని తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. కక్ష సాధింపులతోనే అతన్ని హత్య చేసినట్టు తేలింది. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు, తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా చైన్నె నగరానికి చెందిన థొప్పై గణేషన్‌న్‌ముఠాకు సంబంధించిన వ్యక్తులుగా దర్యాప్తులో తేలింది.

స్వర్ణముఖి నది కట్టపై హత్య

ఆగస్టు 2న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పీఆర్‌ అతిథి గృహం సమీపంలోని స్వర్ణముఖి నది కట్టపై శ్రీకాళహస్తికి చెందిన మగలంపాటి శివకుమార్‌ అలియాస్‌ శివపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి మొదటి పట్టణ పోలీస్‌ స్టేషన్‌న్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో, శ్రీకాళహస్తి డీఎస్పీ కె.నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మొదటి పట్టణ, రెండో పట్టణ, గ్రామీణ, బీఎన్‌. కండ్రిగ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.

సాంకేతిక ఆధారాలతో చిక్కిన నిందితులు

ప్రత్యేక దర్యాప్తు బృందాలు వివిధ సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషించాయి. ఈ క్రమంలో వెంకటేషన్‌కార్తీక్‌, వేలు గోపీనాథ్‌ అలియాస్‌ గుండు గోపి, బి.శ్రీధర్‌ అలియాస్‌ రెడ్డి శ్రీకాళహస్తికి వచ్చి శివకుమార్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మునస్వామి సూర్య, తమిళనాడుకు చెందిన మరో నిందితుడు హత్యకు అవసరమైన ద్విచక్ర వాహనం, కత్తులను సమకూర్చడంలో సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

గణేషన్‌ మరణంతో కక్ష?

కక్ష సాధింపులతోనే శివకుమార్‌ను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడు పోలీసులకు కావాల్సిన నేరస్తుడు, థొప్పై గణేషన్‌కు శివకుమార్‌ శ్రీకాళహస్తిలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గణేషన్‌ మార్చి 16, 2026న చైన్నెలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. శివకుమార్‌ చైన్నె పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే గణేషన్‌ మృతి చెందాడని నిందితులు అనుమానించారు. దీంతో శివకుమార్‌పై కక్ష పెంచుకున్న నిందితులు ప్రతీకార చర్యగా హత్య చేసినట్టు సమాచారం.

నలుగురి అరెస్ట్‌

దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇందులో తమిళనాడుకు చెందిన వెంకటేషన్‌న్‌ కార్తీక్‌ (32), వేలు గోపీనాథ్‌ (అలియాస్‌) గుండు గోపి (27), బి.శ్రీధర్‌ (అలియాస్‌) రెడ్డి (26), తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన చెందిన మునస్వామి అలియాస్‌ సూర్య (19) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నిందితులపై పీడీ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి డీఎస్పీ కె.నరసింహమూర్తితో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement