తిరుపతి రూరల్: విద్యుత్ బకాయిల వసూళ్లలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. బకాయిలు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగా గాజులమండ్యం ప్రాంతంలోని పయనీర్ అల్లాయ్ కాస్టింగ్ ప్రవేట్ లిమిటెడ్‌పై ఆర్‌ఆర్ యాక్ట్ కింద చర్యలు చేపట్టారు. ఆ సంస్థ విద్యుత్ శాఖకు రూ.26,42,460 బకాయి పడింది. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్–1864 కింద ఆస్తి రికవరీ నోటీసు జారీ చేశారు. సంబంధిత సంస్థ ప్రాంగణంలో ఆర్‌ఆర్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపే బ్యానర్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. నిర్ణీత గడువులో బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం తదుపరి రెవెన్యూ రికవరీ చర్యలు చేపడతామని తిరుపతి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి. గంగాధర్‌రెడ్డి తెలిపారు.


