అధనం కోసం ఆరాటం! | - | Sakshi
Sakshi News home page

అధనం కోసం ఆరాటం!

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

ప్రభుత్వ నిధులతోనే శివం టు శివం పనులు చేయిస్తానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి హామీ ఎన్నికల అనంతరం రూ.19 కోట్లతో చేపట్టిన పనులను రద్దు చేయించిన వైనం అదే మొత్తంతో పూర్తి చేస్తానని ప్రగల్భాలు నేడు అదనపు నిధుల కోసం మూడు పర్యాయాలు ప్రతిపాదనలు

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉంటుంది శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తీరు. భక్తులు, స్థానికులకు అనుగుణంగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి అర్ధనారీశ్వరాలయం వరకు గత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు దీనిపై అప్పటి ప్రత్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి విష ప్రచారం చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ నిధులతోనే శివం టు శివం రోడ్డు పనులు పూర్తి చేస్తానని నమ్మబలికాడు. అంతేగాకుండా అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తంతోనే పనులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అ‘ధన’పు నిధుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనిపై దేవదాయ శాఖ సైతం విస్తుపోతోంది.

శివం టు శివం రోడ్డు ఇదే

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: శ్రీకాళహస్తిలో వైఎస్సారీసీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శివం టు శివం రోడ్డు పనులపై బొజ్జల సుధీర్‌రెడ్డి ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికల తరువాత మరో మాట మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కేటాయించిన నిధులతోనే పనులు పూర్తి చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. నేడు అధనపు నిధుల కోసం దేవస్థానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు శ్రీకాళహస్తిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

భక్తులకు అనుగుణంగా ఉంటుందనీ..

భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి అర్థనారీశ్వరాలయానికి వెళ్లి వచ్చేందుకు వీలుగా వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శివం టు శివం రోడ్డు ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి.. శివం టు శివం రోడ్డు పనులకు అనుమతులు తెచ్చారు. అందులో భాగంగా దేవస్థానం నుంచి రూ.19.6 కోట్లతో పనులు ప్రారంభించారు. అదే సమయంలో తుడా నిధులతో స్వర్ణముఖి ఫ్లడ్‌ వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు.

టెక్నికల్‌ శ్యాంక్షన్‌ లేకనే పనులు

దీనిపై నాడు టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. దేవస్థానం నిధులు స్వాహా చేసేందుకు ఈ రోడ్డు పనులు చేపడుతున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే శివం టు శివం రోడ్డు పనులను ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేస్తానని ప్రకటించారు. దేవస్థానం నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనని ప్రగల్భాలు పలికారు. ఎన్నికల అనంతరం బొజ్జల సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక 2024 జూన్‌ 5న శివం టు శివం రోడ్డు పనులు పరిశీలించారు. పనులు రద్దు చేయమని ఆదేశించారు. టెక్నికల్‌ శ్యాంక్షన్‌ లేకనే పనులు ప్రారంభించారు.

మళ్లీ మళ్లీ ప్రతిపాదనలు

ప్రభుత్వ నిధులతోనే శివం టు శివం రోడ్డు పనులు పూర్తి చేస్తానని ప్రకటించి ఎమ్మెల్యే బొజ్జల సుఽధీర్‌రెడ్డి దేవస్థానం నిధులతోనే పనులు చేపట్టారు. అంతటితో ఆగకుండా బ్యూటిఫికేషన్‌ పేరుతో అధనంగా రూ.5 కోట్లు ఓ సారి, రూ.4 కోట్లు మరోసారి, తాజాగా రూ.3.7 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయడానికి దేవదాయశాఖ ఒప్పుకోలేదు. దీంతో డీఈ మురళీధర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక గుండె పోటుతో మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాడు అనుకున్న ప్రకారం అయితే రూ.19.6 కోట్లు అవసరమయ్యేదని, నేడు అంత కూడా అవసరం లేదని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బొజ్జలా..మాట మార్చేదెలా?

కలిసొచ్చిన జాతీయ రహదారి నిర్మాణ పనులు

ఇటీవల జాతీయ రహదారి నిర్మించడంతో శివం టు శివం రోడ్డులో కొంత భాగాన్ని నేషనల్‌ హైవే అథారిటీ వారే నిర్మించారని తెలిసింది. ఆ నిర్మాణంతో శివం టు శివం రోడ్డు పనులకు కొంత కలిసొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. శివం టు శివం రోడ్డు పనుల పేరుతో అంచనాలు పెంచుకుంటూ పోతుండడంతో దేవదాయశాఖ అధికారులకు అనుమానం వచ్చింది. అందుకే టెక్నికల్‌ శాంక్షన్‌ ఇవ్వలేదని సమాచారం. శివం టు శివం రోడ్డు పనుల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు నేడు అమరావతి నుంచి దేవదాయశాఖ అధికారలు శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రోడ్డు పనులు, స్థానికులు, భక్తులు, దేవస్థానం అధికారుల అభిప్రాయాలు తీసుకుని నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement