రేపు నెల 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ దరఖాస్తుకు గడువు | - | Sakshi
Sakshi News home page

రేపు నెల 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ దరఖాస్తుకు గడువు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఈ ఏడాది పది, ఇంటర్మిడియెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 15వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మధ్యలో ఆపేసిన విద్యను ఓపెన్‌ స్కూల్‌ ద్వారా కొనసాగించుకోవాలని డీఈఓ పిలుపునిచ్చారు.

14న స్పాట్‌ కౌన్సెలింగ్‌

చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన, చేయని అభ్యర్థులు స్పాట్‌ కౌన్సెలింగ్‌కు ఈనెల 14వ తేదీన గుంటూరులో హాజరు కావాలని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రిక మంగళవారం తెలిపారు. 14వ తేదీన ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, కృష్ణ ఆడిటోరియంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆమె సూచించారు.

ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో గురువారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాలో పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సుమా రు 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, ఎంబీఏ, డీ, బీ, ఎంఫార్మ సీ పూర్తి చేసిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం వర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

తల్లీబిడ్డ వాహనాల ప్రారంభం

తిరుపతి అర్బన్‌: తల్లీబిడ్డ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కొత్తగా జిల్లాకు మంజూరైన 16 తల్లీబిడ్డ 102 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు సంబంధిత వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా 102కి కాల్‌ చేస్తే సరిపోతుందని చెప్పారు. ప్రధానంగా గర్భిణులు, బాలింతల కోసం మాత్రమే 102 వాహనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 16 వాహనాల్లో 15 వాహనాలు తిరుపతి ప్రాంతానికి మాత్రమే వినియోగిస్తారని, మిగిలిన ఒక వాహనం శ్రీకాళహస్తి ప్రాంతంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. తిరుపతి ఎమెల్యే ఆరణి శ్రీనివాసులు, డీఎంఅండ్‌హెచ్‌వో బాలకృష్ణనాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆనందమూర్తి, డీటీసీ మురళీమోహన్‌, పార్టీ నేతలు నరసింహయాదవ్‌, పనబాకలక్ష్మి పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీలో

తగ్గిన సానుకూలత

తిరుపతి అర్బన్‌: పింఛన్ల పంపిణీ విషయంలో గతంలో 91శాతం సానుకూలత ఉండేదని, అయితే ప్రస్తుతం అది 86శాతానికి తగ్గిందని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో ఆయన సమీక్షించారు. పింఛన్ల పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పెద్ద ఎత్తున జెండా పండుగపై ప్రచారం చేపట్టాలని సూచించారు. 13 నుంచి 15వ తేదీ వరకు హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండాను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్‌, భానుప్రకాష్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డీపీవో సుశీలాదేవి, డ్వామా పీడీ మద్దిలేటి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజా నాయక్‌, జీఎస్‌డబ్ల్యూ కో ఆర్డినేటర్‌ జగదీష్‌ పాల్గొన్నారు.

నేడు జూడాల మెరుపు సమ్మె

తిరుపతి తుడా: ఏపీ జూనియర్‌ డాక్టర్ల సంఘం పిలుపు మేరకు స్టయిఫండ్‌ పెంపుకోసం రాష్ట్ర సమ్మెకు మద్దతుగా బుధవారం సమ్మెకు దిగుతున్నట్లు ఎస్వీ జూనియర్‌ డాక్టర్ల నేతలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఎస్వీ మెడికల్‌ కళాశాలలో అకడమిక్‌ తరగతులు, రుయాలో అత్యవసర సేవలు మినహా ఓపీడీ సేవలు నిలిపివేస్తునట్లు ప్రకటించారు. ఉదయం 9నుంచి జూనియర్‌ డాక్టర్లు ర్యాలీలో పాల్గొని పీజీ వైద్యులకు శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని నినదించనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement