తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధి, నెల్లూరు జిల్లా కోటలోని డా.బిఆర్.అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రికి మంగళవారం ఎంపీ లేఖ రాశారు. గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని ఐఐటీ–జేఈఈ, నీట్ కోచింగ్ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ ఎంతోకాలంగా సేవలందిస్తున్న గురుకుల పాఠశాలను ఉన్నట్టుండి మూసివేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తూ, అవసరమైతే అదే ప్రాంతంలో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.


