తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో రూపొందించినదే జగన్ 2.0 సూపర్ యాప్ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద శుక్రవారం జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన పోస్టులను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, కుట్రలు పన్నడం జరుగుతున్న నేపథ్యంలో జగన్ 2.0 సూపర్ యాప్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చినట్టు తెలిపారు. తద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పవచ్చన్నారు. ఈ యాప్‌లో మన పార్టీ వాళ్లు మాత్రమే ఉంటారని, ఎవరు పడితే వాళ్లు డిలీట్ చేసే హక్కు ఉండదన్నారు. ఇది ఒక మంచి పరిణామమన్నారు. పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటారన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమవ్వవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణులు కెఎ.సత్య, తుడా వెంకటరెడ్డి, మునిరెడ్డి, బెల్లం రమేష్, కోటూరు ఆంజినేయులు, నల్లాని బాబు, వాసుయాదవ్, రాజేష్, ఉదయ్‌వంశీ, పసుపులేటి సురేష్, అమరనాథ్‌రెడ్డి, విడగొట్టి రమణ, లవ్లీ వెంకటేష్, వెంకటేష్‌రాయల్, ధనశేఖర్, విజయలక్ష్మి, పుణీత తదితరులు పాల్గొన్నారు.


