శ్రీవారి దర్శనార్థం వచ్చిన మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామిని అవమానించడం దుర్మార్గం బీఆర్ నాయుడు తాబేదారులు, బ్లాక్‌టికెట్‌గాళ్లకు రెడ్‌కార్పెట్లు టీటీడీ చైర్మన్ అసమర్థ పాలనపై భూమన ఫైర్
తిరుపతి మంగళం : టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టాక టీటీడీలో జరగని అపచారాలు, అవినీతి అక్రమాలే లేవని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం కల్పించకుండా అవమానిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో టీటీడీని భ్రష్టుపట్టించడమే కాకుండా తిరుమల శ్రీవారి పవిత్రతను దిగజార్చారని మండిపడ్డారు. గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన దళితుడు, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి శ్రీవారి దర్శనం కూడా సక్రమంగా కల్పించకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా తీవ్రంగా అవమానించడం బీఆర్ నాయుడు దుర్మార్గపాలనకు నిదర్శనమన్నారు. నారాయణస్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి వారు చేసిన అవమానానికి తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. నారాయణస్వామికే కాకుండా ఎమ్మెల్సీ, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ భరత్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపులు ఉంటే బయట ఉండాలే తప్ప దేవుడి సన్నిధిలో ఉండరాదన్నారు. తిరుమలలో బీఆర్ నాయుడి తాబేదారులకు, బ్లాక్‌టికెట్ గాళ్లకు రెడ్‌కార్పెట్ వేస్తూ వారికి స్వామి వారి హారతులు, దేవుడి దగ్గర ఉంటే అరటి పండ్లు, మామడి పండ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులను మాత్రం అవమానిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఆఫీసులోనే ‘సర్’ తతంగం
సర్ ఓటరు సర్వే ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌లను ఇచ్చి సక్రమంగా ఓటరు సర్వేను నిర్వహించాల్సింది పోయి టీడీపీ ఆఫీసులలోనే సర్ తతంగమంతా జరుగుతోందని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్‌ఏలు రోడ్లపైన ఉండి సర్ ఓటరు సర్వే సక్రమంగా జరిగేలా చూస్తుంటే టీడీపీ నాయకులు మాత్రం వారి ఆఫీసులలో కూర్చుని సర్ తతంగం నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కోటూరు ఆంజినేయులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసుయాదవ్ పాల్గొన్నారు.


