తిరుపతి రూరల్: తిరుపతి శివారులోని తాజ్ హోటల్‌కు భద్రత కల్పించాలని శుక్రవారం హోటల్ యాజమాన్యం తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. శనివారం ఉదయం 10 గంటలకు తమ హోటల్‌లో ‘రా ఎన్టీఆర్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఆ అసోసియేసన్ వ్యవస్థాపకులు సాయిరూప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజులుగా రా ఎన్టీఆర్ అసోసియేషన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో హోటల్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రత కల్పించాలని యాజమాన్యం కోరింది. ఈ మేరకు తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి ఫిర్యాదు స్వీకరించారు.


