
తొలగింపుపై తిరుగుబాటు!
తిరుపతి సిటీ : ఎస్వీయూలో అధికారుల అత్యుత్సాహంతో వీధినపడిన 43 మంది తాత్కాలిక అధ్యాపకుల విషయంలో ఈసీ మెంబర్లు పునరాలోచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పాలకమండలి సభ్యులు ఒక్కొక్కరూ తమ తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. సుమారు 15ఏళ్ల నుంచి 20ఏళ్ల పాటు వర్సిటీకి సేవలందించిన అకడమిక్ కన్సల్టెంట్లను ఫెర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించిన వర్సిటీ అధికారులు ఒక్కో ఈసీ మెంబర్‌పై ఒత్తిడి తెచ్చి ఆమోదపు పత్రాలను తెప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈసీ మీటింగ్ నిర్వహించి తాత్కాలిక అధ్యాపకుల ఇంటర్వ్యూల నిర్వహణపైన, తొలగింపు ప్రక్రియపైనా ఈసీ ఆమోదం పొందాల్సి ఉంది. వర్సిటీ అధికారులు చాకచక్యంగా వారిని మభ్యపెట్టి తొలగింపు ప్రక్రియపై పూర్తి వివరాలను అందించకుండా ఈసీ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా అర్హులైన అధ్యాపకులను సైతం రోడ్డున పడేశారు.
అవగాహన లేకనే...ఆమోదం తెలిపా...
ఎస్వీయూలో 43 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించడం బాధాకరమని, ఈ మేరకు తాను సమ్మతి తెలుపుతూ పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని పాలకమండలి సభ్యులు వి.జ్యోతి తెలిపారు. సోమవారం ఈ మేరకు వీసీ అప్పారావుకు వినతిప్రతం సమర్పించారు. తాను అవగాహన లోపంతో ఆమోదం తెలపానని పేర్కొన్నారు. అధికారులు తక్షణం పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.