
పింఛన్ల తొలగింపుపై ఆందోళన
కలువాయి(సైదాపురం) : పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసుల అందిన నేపథ్యంలో పలువురు దివ్యాంగులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలో దాదాపు 92 మందికి పింఛన్ల నిలిపివేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పక్షవాతంతో మంచాన పడిన వారికి సైతం పెన్షన్ తీసివేయడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మాత్రం కనికరం కూడా లేకుండా దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు తగు న్యాయం చేయాలని కోరారు.
కానిస్టేబుల్‌కు రివార్డు
తిరుపతి క్రైమ్ : తిరుమలలో ఈ నెల 15వ తేదీన గుండెపోటుకు గురైన శ్రీనివాస్(60) అనే భక్తుడికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గుర్రప్పకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సోమవారం రివార్డు అందించారు. గుర్రప్ప స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాభావంతో నడుచుకోవాలని ఎస్పీ సూచించారు.
మీసేవ నిర్వాహకుడిపై విచారణ
కలువాయి(సైదాపురం): అక్రమంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్న కలువాయి మీసేవ కేంద్రం నిర్వాహకుడు వెంకటరత్నంపై డీఎల్‌పీఓ రమణయ్య సోమవారం విచారణ చేపట్టారు. 1బీ అండగల్, పాస్‌బుక్ అప్లై చేసేందుకు అధిక మొత్తంలో నగదు తీసుకున్నాడని విశ్రాంత ఉపాధ్యాయుడు కాకివాయి గోపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డీఎల్‌పీఓ రమణయ్య వెల్లడించారు.
270 ఆటోలకు జరిమానా
తిరుపతి క్రైమ్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ నెల 12వ తేదీ నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 270 ఆటోలకు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి తెలిపారు. సోమవారం సైతం తనిఖీలు నిర్వహించామని, ఇప్పటి వరకు 27 ఆటోలను సీజ్ చేశామని వెల్లడించారు. డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.