
టెండర్‌లో బెదిరింపులు
తిరుపతిలోని హథీరాంజీ మఠం అధికారికి టీడీపీకి చెందిన పెద్దబ్బగా పిలుచుకునే నాయకుడు వార్నింగ్ ఇచ్చాబడు. తమ అనుమతి లేకుండా గుత్తేదారులు భవనం కూల్చడానికి వీల్లేదంటూ తీవ్ర స్ధాయిలో హెచ్చరించినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● మఠం అధికారికి టీడీపీ నేత వార్నింగ్ ● హథీరాంజీ మఠం భవనం కూల్చివేతకు ముగిసిన టెండర్ ప్రక్రియ ● టెండర్ దక్కించుకున్న పుత్తూరు పైనీర్ స్టిల్స్
తిరుపతి అన్నమయ్య సర్కిల్ :తిరుపతి గాంధీ రోడ్డులో శిథిలావస్థకు చేరిన హథీరాం బావాజీకి చెందిన మఠం భవనం కూల్చివేతకు సంబంధించిన టెండర్ల స్వీకరణ ప్రక్రియ శనివారం నిర్వహించారు. ఎండోమెంట్ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ నోటీసులతో మఠం పరిపాలనాధికారి బాపిరెడ్డి కూల్చివేత ప్రక్రియకు సంబంధించి టెండర్ల ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, పుత్తూరు, తిరుపతి వివిధ ప్రాంతాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో బిడ్ దాఖలు చేసిన ఐదుగురితో పాటుగా 27 మంది ఆఫ్‌లైన్‌లో మొత్తం కలిపి 32 మంది ఈ టెండర్ నిర్వహణలో పాల్గొన్నారు. మఠం భవనం కూల్చివేసే సమయంలో అక్కడి మెటీరియల్‌కు సంబంధించి నిర్వహించిన టెండర్ ప్రక్రియలో మొదటగా ఆన్‌లైన్‌లో రూ.37 లక్షల రూపాయలకు బిడ్ దాఖలు కావడంతో, మఠం అధికారులు రూ.37 లక్షల నుంచి వేలం పాటను ప్రారంభించగా పుత్తూరుకు సంబంధించిన పైనీర్ స్టిల్స్ వారు రూ.97 లక్షలా20 వేల రూపాయలకు హెచ్చు పాటను నమోదు చేశారు. అలాగే భవనం కూల్చివేతకు సంబంధించి నిర్వహించిన వేలం పాటలో రూ.లక్షా 50 వేల రూపాయలను హెచ్చు పాటగా నమోదు చేయడంతో వీరికి రెండు టెండర్లను ఇస్తున్నట్లుగా మఠం అధికారులు ప్రకటించారు.
రీటెండర్ నిర్వహించాలి
శ్రీ స్వామి హథీరాంజీ మఠం మండువా భవనం కూల్చివేతకు సంబంధించి శనివారం జరిగిన టెండర్ ప్రక్రియ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా జరిగిందని రాజమండ్రికి చెందిన గుత్తేదారు నూర్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐఐటీ నివేదిక ప్రకారం మఠం మండువా భవనం ప్రాంతంలో ఎక్కడ నుంచి ఎక్కడి వరకు కూల్చివేతలు నిర్వహిస్తారనే అంశంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా టెండర్లు నిర్వహించడం సమంజసం కాదన్నారు. జిల్లా కలెక్టర్ ఈ టెండర్ ప్రక్రియలో జోక్యం చేసుకొని రిటెండరింగ్ నిర్వహిస్తే మరింతగా వేలంపాట నగదు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని కలెక్టర్ మఠం భవనం కూల్చివేతకు సంబంధించి రీటెండరింగ్‌కు చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరసన నినాదాలు..
దుకాణదారులు మఠం ప్రారంభ ద్వారం వద్ద మఠం అధికారుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కాగా దుకాదారులకు మద్దతుగా నిలిచిన టీడీపీ నాయకుడు మఠం అధికారిని ఉద్దేశించి తమ మాటను కాదని భవనం కూల్చివేతకు అడుగేస్తే ఎదురయ్యే శాంతి భద్రతలకు సమస్య కారణం అవుతారంటూ పరోక్షంగా చేసిన హెచ్చరికలు భయోందోళనలకు దారితీసినట్లయింది.