
ఆడికృత్తిక ఉత్సవాలకు సారె
● ఆనందగిరి, పద్మగిరి క్షేత్రాలకు పట్టువస్త్రాలు ● చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి సమర్పణ
తిరుపతి రూరల్ : ఆడికృత్తిక మహోత్సవాలను పురస్కరించుకుని పాకాల, తిరుపతి రూరల్ మండలాల్లో సుబ్రమణ్యస్వామి ఆలయాలకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబీకులు సారెను సమర్పించారు. ఏటా ఆడికృత్తిక ఉత్సవాలకు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమలతో సారెను తీసుకువెళ్లి సమర్పించారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సారెను తీసుకువెళ్లగా వారి వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. ముందుగా పాకాల మండలం ఊట్లవారిపల్లి వద్దనున్న ఆనందగిరి శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను అందించారు.
పద్మగిరి కొండపై పూర్ణకుంభ స్వాగతం
పద్మగిరిపై వెలసిన బాలజ్ఞాన దండాయుధపాణి ఆలయానికి పట్టు వస్త్రాలను తుడా మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజక వర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అందజేశారు. ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం వేద పండితుల ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆడికృత్తిక ఉత్సవాలకు సారె