
హరోంహర నామ స్మరణతో మార్మోగిన రామగిరి
నాగలాపురం : ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని పిచ్చాటూరు మండలం రామగిరి సుబ్రమణ్యస్వామి ఆలయ ప్రాంగణం హరోంహర నామస్మరణలతో మారుమోగింది. శ్రీవళ్లి,దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో భరణి తెప్పోత్సవాలు శుక్రవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. స్వామివారి మూలవర్లకు అర్ఛకులు భరణి అభిషేకం చేసి, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని పుష్కరణిలో కావళ్లు చెల్లించి, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం శ్రీ వళ్లి,దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేసి, విశేషాలంకరణ చేసి తిరుచ్చిపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవం నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తజనం రాత్రంతా ఆలయ ప్రాంగణలో జాగారం చేశారు. భక్తుల కాలక్షేపం కోసం భక్త మార్కండేయ హరికథగానం చేశారు. భరణి అభిషేక ఉభయదారులుగా పళ్లికొండేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ఈఓ ముత్తం శెట్టి రామచంద్రరావు ఏర్పాట్లు పర్యావేక్షించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుత్తూరు డీఎస్పీ రవి కుమార్ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 130 మంది పోలీసు బందోబస్తులో పాల్గొన్నట్లు పిచ్చాటూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నేటి నుంచి రాజనాలబండ జాతర
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ లక్ష్మినరసింహస్వామి ,శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నేటి నుంచి రెండు రోజులపాటు వైభవంగా జాతర జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో తిరుణాల జరగనుందన్నారు. ఏటా పూర్వీకుల నుంచి శ్రావణమాస చివరి శనివా రం రోజున రాజనాలబండపై వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు పక్కనే ఉన్న ఎత్తైన శ్రీలక్ష్మినరసింహస్వామి కొండపై భక్తులు తరలివెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. అదే రోజు రాత్రి కొండపై గల రాతి స్తంభంపై దీపం వెలిగించి అఖండ దీపారాధన చేస్తారు. స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు చేపడుతారు.