మూగబోయిన ఆటల గంట! | - | Sakshi
Sakshi News home page

మూగబోయిన ఆటల గంట!

Aug 16 2025 8:37 AM | Updated on Aug 16 2025 8:37 AM

మూగబో

మూగబోయిన ఆటల గంట!

కనిపించని మైదానాలు క్రీడలకు విద్యార్థులు దూరం తరగతిగదిలో బాల్యం బందీ

విశ్వవేదికలపై మన క్రీడాకారులు గెలిచిన వేళ..పిడికిలి బిగించి విజయ చిహ్నంగా మన జాతీయజెండా ఎగురవేసిన వేళ.. మన క్రీడాకారులను చూసిన సమయంలో నా బిడ్డా అంతటిస్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు.. నేనూ అలాంటి స్థాయికి చేరుకోవాలని విద్యార్థులు కలలు కంటారు. ఆ దిశగా అడుగులు పడాలంటే నిరంతర క్రీడా సాధన అవసరం. అందుకు కాలు మోపే మైదానాలుండాలి. క్రీడా పునాదికి పాఠశాలల్లో తప్పనిసరిగా ఆట స్థలాలు ఉండాలి. జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. బాల్యం తరగతి గదిలో బందీ అవుతున్నా..పాలకులు, అధికారులు మిన్నకుంటున్నారు.

తిరుపతి సిటీ: నేటితరం విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలను ప్రోత్సహించాల్సిన పాఠశాలలు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలలోనూ క్రీడా మైదానాలే కానరావడం లేదు. ఆ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు గల్లీ క్రికెట్‌ తప్ప తమకు ఏ క్రీడలు తెలియవని చెబుతుండడం ఆశ్చర్యకరం. జిల్లాలో అధికారులకు ముడుపులు చెల్లించి మౌలిక వసతులు లేకపోయినా ధనార్జనే ధ్యేయంగా అధికార, ధన బలంతో ఇప్పడిముబ్బడిగా వీధికి ఒక ప్రైవేటు పాఠశాలు ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కోక్క పాఠశాలలకు అనుమతులు లేకపోయినా రెండు, మూడు బ్రాంచ్‌లను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలో చదివే విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో అధిక సంఖ్యలో పాల్గొనకపోవడంపై ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి.

భవనాలు.. అపార్ట్‌మెంట్లలో విద్యాసంస్థలు

జిల్లాలోని సుమారు 90 శాతం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలలో కనీస వసతులు లేవు. ఆట స్థలాలు ఊసే లేదు. కుటుంబాలు అద్దెకు ఉండే భవనాలు, అపార్ట్‌మెంట్లలో విద్యాసంస్థలను నడుపుతూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రక్రియ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించి, అధికారులతో యాజమాన్యాలు చేతులు కలిపి అనుమతులు పొందుతున్నారు. క్రీడా మైదానం లేకపోయినా యాజమాన్యాలు అధికారుల చేయితడిపి అన్ని సౌకర్యాలున్నట్లు అనుమతులు పొంది పక్కా రికార్డులు తయారు చేసుకుని తమ పనికానిచ్చేస్తున్నారు. అడిగే నాథుడు లేకపోవడంతో ప్రైవేటు యాజయాన్యాలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి.

పీఈటీలు, పీడీల నియామకాలు నిల్‌

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మైదానాల మాట దేవుడెరుగు. కనీసం పీఈటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల నియామకాల ఊసే లేదు. 10 శాతం పాఠశాలల్లో పీఈటీలున్నా తగిన అర్హతలు, సమర్థులైన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండడం లేదు. ఇంటర్‌, డిగ్రీ చదివిన వారిని నియమించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే మరికొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు పీడీ పోస్టు నియామకం జరిపినట్లు ఇతరుల ఫేక్‌ ధ్రువపత్రాలతో అనుమతులు పొందిన విద్యాసంస్థలు కోకొల్లలు. అధికారులకు రూ.లక్షలలో ముడుపులు చెల్లించి, విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కాస్తో కూస్తో మైదానాలు, పీఈటీలు ఉన్నారు. దీంతో అడపదడపా జిల్లా స్థాయికి పాఠశాలల నుంచి కొందరు ఎంపిక అవుతున్నారు.

స్వతహాగా తల్లిదండ్రులే శిక్షణ ఇప్పిస్తున్నారు

ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్నా యాజమాన్యాలు అవకాశం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు స్వతహాగా ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడలను ఎంపిక చేసుకునుని, నెలకు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రవేశాల సమయంలో ఏవేవో కథలు చెప్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తామని ప్రగల్భాలు పలికి రూ.లక్షల్లో ఫీజలు వసూలు చేసి, ఆ తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తామే ఉదయం, సాయంత్రం ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నామని చెబుతున్నారు.

త్వరలో యాజమాన్యాలతో చర్చిస్తాం

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను యాజమాన్యాలు క్రీడల వైపు ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాలకు ప్రత్యేక క్రీడా మైదానం తప్పకుండా ఉండాల్సిందే. అందులోనూ అర్హులైన పీఈటీలను నియమించుకోవాలి. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. త్వరలో అన్ని ప్రైవేటు యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తాం.

–కేవీఎన్‌ కుమార్‌, డీఈఓ, తిరుపతి జిల్లా

ప్రతి కళాశాలకూ ఆట స్థలం ఉండాల్సిందే!

జిల్లాలోని అన్ని ప్రైవేటు కళాశాలలో క్రీడా మైదనాలు ఉండాల్సిందే. లేని పక్షంలో చర్యలు తప్పవు. అలాగే ప్రతి కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఫిజికల్‌ డైరెక్టర్ల నియామకం జరపాలి. అందులోనూ సమర్థులైన పూర్తి స్థాయి అర్హతగలిగిన అభ్యర్థులనే ఎంపిక చేయాలి. ప్రతి రోజూ క్రీడలకు సంబంధించి ప్రత్యేక పీరియడ్‌ను టైంటేబుల్‌లో ఉంచి తీరాలి.

–రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి

సొంతంగా కోచింగ్‌ ఇప్పిస్తున్నాం

మా అమ్మాయి నగరంలోని ఓ పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థలో ఆరో తరగతి చదువుతోంది. క్రీడల ఊసే ఉండదు. కానీ మా అమ్మాయికి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ కోచ్‌ వద్ద నెలకు రూ. 6 వేలు చెల్లించి సొంతంగా కోచింగ్‌ ఇప్పిస్తున్నాం. ఇప్పటివరకు నాకు తెలిసి తిరుపతి జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలోనూ క్రీడలను ప్రోత్సహించే యాజమాన్యాలు లేవు. ఇది మరి దారుణం.

–పద్మావతి,

విద్యార్థిని తల్లి, తిరుపతి

అధికారుల ఉదాశీనతతోనే..

విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రైవే టు విద్యాసంస్థలు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నా యి. అధికారులకు ముడుపు లు చెల్లించి క్రీడా మైదానాలున్నట్లు అనుమతులు పొందుతున్నాయి. మా అబ్బాయి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అతడి రోజువారీ టైంటేబుల్‌ చూస్తే పీఈటీ కోసం పీరియడ్‌ ఉండదు. ఎందుకంటే ఆ పాఠశాలల్లో పీఈటీ లేరు. పిల్లలకు వ్యాయమం తగ్గి, అనారోగ్యం పాలు కావడానికి ఇదో కారణం.

–స్వర్ణలత, విద్యార్థిని తల్లి, తిరుపతి

మూగబోయిన ఆటల గంట! 1
1/4

మూగబోయిన ఆటల గంట!

మూగబోయిన ఆటల గంట! 2
2/4

మూగబోయిన ఆటల గంట!

మూగబోయిన ఆటల గంట! 3
3/4

మూగబోయిన ఆటల గంట!

మూగబోయిన ఆటల గంట! 4
4/4

మూగబోయిన ఆటల గంట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement