అప్పుల జీవనం! | - | Sakshi
Sakshi News home page

అప్పుల జీవనం!

Aug 16 2025 8:36 AM | Updated on Aug 16 2025 8:36 AM

అప్పు

అప్పుల జీవనం!

● టీటీడీ విద్యాసంస్థల్లో తాత్కాలిక అధ్యాపకుల ఇక్కట్లు ● 3 నెలలుగా వేతనం కోసం పడిగాపులు ● పట్టించుకోని అధికారులు

అందని జీతం..

తిరుమల శ్రీవారి సేవా పరివారంలో స్థానం.. టీటీడీ విద్యాసంస్థల్లో ఉద్యోగం.. తాత్కాలిక ప్రాతిపదికనే అయినా అపురూపమైన వరం.. వేలాది మంది పేద విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే అద్భుత అవకాశం.. దేవదేవుని పాదాల చెంత గురువులుగా విధులు నిర్వర్తించే మహద్భాగ్యం.. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా తయారైంది కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పరిస్థితి. వేతనం కోసం పడిగాపులు కాయల్సిన దుస్థితి దాపురించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలలుగా జీతాలు అందక.. అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోంది.

తిరుపతి సిటీ : తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కొన్నేళ్లుగా 330 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నారు. అధికారుల తీరుతో ఉద్యోగ భద్రత దేవుడెరుగు కనీసం జీతాలకు నోచుకోక అలమటిస్తున్నారు. జూన్‌ నుంచి వేతనాల ఊసేలేక పోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వైపు పిల్లల స్కూల్‌ ఫీజులు చెల్లించలేక, మరో వైపు కుటుంబావసరాలను తీర్చుకోలేక దయనీయస్థితిలో బతుకీడుస్తున్నారు. కొందరు ఈఎంఐలు కట్టలేక అపరాధ రుసుంతో అప్పు చేసి చెల్లిస్తుండగా, మరికొందరు ఇంట్లోని బంగారు వస్తువులను తాకట్టు పెట్టి జీవనం సాగిస్తున్నారు. జీతాలు ఎప్పుడు జమ చేస్తారో తెలియని అయోమయంలో అధ్యాపకులు నలిగిపోతున్నారు.

పెరుమాళ్లకే ఎరుక!

టీటీడీ ఆధ్వర్యంలో మూడు జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 51మందికి రెన్యువల్‌ ఉత్తర్వులు అందినా వేతనాలు పడలేదు. డిగ్రీ కళాశాలలోని 161 మంది తాత్కాలిక అధ్యాపకులకు ఇప్పటి వరకు రెన్యువల్‌ ఉత్తర్వులే అందలేదు. ఈ పరిస్థితుల్లో ఇక జీతాలు ఎప్పుడు వేస్తారో పెరుమాళ్లకే ఎరుకని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల్లో సుమారు 110 మందికి పైగా తాత్కాలిక ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయి మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

వేతనాల ఫైల్‌ను సంబంధిత అధికారులకు పంపించడంలో కిందిస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సైతం వేతనాల ఫైల్‌ను తమ వద్దకు తెప్పించుకుని పరిశీలించడంలో మనకేందుకులే...అంటూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలను అందుకుంటూ కుటుంబాలను సాఫీగా నడుపుకుంటున్నారు. తాత్కాలిక ఉద్యోగులపై ఎందుకీ వివక్ష అంటూ అధ్యాపకులు మండిపడుతున్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో అయినా వేతనాలు చేతికందేనా అంటూ ఏడుకొండలవైపు చూస్తున్నారు.

కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది

గత మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. నిత్యావసరాలకు సమీపంలోని షాపులలో అప్పులు పెడుతున్నాం. జీతాలు జమ కాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పండుగలు, ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నామంటే అతిశయోక్తి కాదు. పిల్లల స్కూల్‌ ఫీజులు, ఈఎమ్‌ఐలు కట్టేందుకు అవస్థలు పడుతున్నాం. టీటీడీ అధికారులు మా దయనీయ స్థితిని అర్థం చేసుకుని త్వరగా వేతనాలు అందించాలని వేడుకుంటున్నాం. – టీటీడీ విద్యాసంస్థల్లోని

తాత్కాలిక అధ్యాపకులు

అప్పుల జీవనం!1
1/1

అప్పుల జీవనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement