
జెండా రెపరెపలు
చంద్రగిరి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరిలోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల విద్యార్థులు ఎంఈఓ లలిత ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. సుమా రు 1500 అడుగుల భారీ జాతీ య జెండాతో చంద్రగిరి పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. కార్యకమ్రంలో పాఠశాల చైర్మన్ హితేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
20న రుణమేళాపై అవగాహన
తిరుపతి కల్చరల్ : జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎంఎస్‌ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన రామానుజ సర్కిల్లోనున్న రెగాలియా హోటల్లో రుణమేళా, కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరువుతారని, అర్హత కలిగిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారికి తక్షణమే రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ రుణ మేళాలకు హాజరయ్యే వారు ఈనెల 19వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9490190498, 7995915450 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు.
తిరుమలలో దొంగల చేతివాటం
తిరుమల : పార్కింగ్ లో ఉంచిన కారు అద్దాలు పగులకొట్టి గుర్తుతెలియని దండగులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం వెలుగు చూసింది. తిరుమల టూ టౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం, వేలూరుకు చెందిన నిత్యవేలు కుటుంబ సభ్యులతో కలిసి కారులో బుధవారం తిరుమలకు చేరుకున్నారు. స్థానిక నారాయణగిరి పార్కింగ్‌లో కారును ఉంచి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగీ గురువారం ఉదయం వచ్చి చూడగా కారు వెనుక అద్దాలు పగులకొట్టి ఉన్నాయి. కారులోని బ్యాగులో ఉంచిన రెండు జతల కమ్మలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. చోరీపై భక్తుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
స్కూళ్లను తనిఖీ చేయండి : కలెక్టర్
తిరుపతి అర్బన్: కార్యాలయాలకే పరిమితం కాకుండా స్కూళ్లను తనిఖీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఉప విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరాదేవి గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు కలెక్టర్ మార్గదర్శనంచేశారు. మెనూ ప్రకారం స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పెట్టేలా చూడాలని, నాణ్యమైన విద్య అందేలా చూడాలని ఆదేశించారు.

జెండా రెపరెపలు