
ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం
తిరుపతి తుడా: స్విమ్స్ వర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. నీట్–2025 ఆల్ ఇండియా కోటాలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా గురువారం తొలివిడత ప్రవేశాలకు పూనుకున్నారు. కర్నూలుకు చెందిన సాయి శ్రీనిత్య జాతీ య స్థాయిలో 14,255 ర్యాంకు సాధించి తొలి అడ్మిషన్ పొందారు. వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ అడ్మిషన్ ధృవ పత్రాన్ని విద్యార్థినికి అందజేశారు.
జాలర్లకు ఇళ్ల స్థలాలు
తడ : మండలంలోని దీవి గ్రామం ఇరకంలో నివసిస్తున్న జాలర్లకు పూడి గ్రామం వద్ద ఏడాది క్రితం తయారు చేసిన జగనన్న లే అవుట్‌లో 172 మందికి కేటాయించిన ఇళ్ల స్థలాలను కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా గురువారం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. తడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్కీడిప్ ద్వారా పట్టాల నంబర్లు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరకం దీవిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పట్టాలు త్వరితగతిన మంజూరు చేశామన్నారు. గ్రామంలో మిగిలిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫొటో లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. దానిని ఇప్పుడు టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం నాయకులు పాల్గొన్నారు.