
బాధ్యతగా అటవీ సంరక్షణ
తిరుపతి రూరల్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణను బాధ్యతగా తీసుకుని ఫారెస్ట్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం ఎర్రావారిపాళెం మండలం తలకోనలోని అటవీశాఖ అతిథిగృహంలో జిల్లా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా మియావకీ ప్లాంట్లను అభివృద్ధి చేయాలన్నారు. వన్యప్రాణులను ఎవరైనా వేటాడితే నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపాలని స్పష్టం చేశారు. ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందించాలని సూచించారు. అటవీ భూముల ఆక్రమణకు యత్నిస్తే కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం అటవీ అధికారులు తయారు చేసిన అజెండాలోని అంశాల వారీగా సమీక్షించారు.
ప్రధాన అంశాలు ఇవీ...
● ఏనుగులు, చిరుతల వివరములను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
● ఎలిఫెంట్ అటాక్ ఫోర్స్‌ను మరింత అప్రమత్తం చేయాలి.
● ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన వారికి పరిహారం కింద సుమారు రూ. 60లక్షల చెల్లింపులకు ఆమోదం తెలిపారు.
● పెండింగ్‌లోని రెవెన్యూ, అటవీ భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలి.
● అటవీ, వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్‌లో సత్యవేడు రేంజ్ పరిధిలోని ఉబ్బలమడుగు కమ్యూనిటీ బేస్ట్ ఎకో టూరిజం సెంటర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అటవీ సంరక్షణాధికారి సెల్వం, జిల్లా అటవీశాఖ అధికారి వివేక్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనా, డీఆర్‌ఓ నరసింహులు, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, కిరణ్మయి, డివిజనల్ అటవీ అధికారి శ్రీనివాసులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అరుణ్‌కుమార్, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.