
‘పరిశోధక’.. వేదన తీరక!
తిరుపతి సిటీ : ఎస్వీయూ అర్థశాస్త్ర విభాగంలో ఒక పరిశోధక విద్యార్థి అవమానకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. పీహెచ్‌డీ చేసేందుకు విభాగానికి వచ్చిన ఆ విద్యార్థి కూర్చోవడానికి గది లేక కాలేజీ వరండాలో నేలపై కూర్చొని నోట్సు రాసుకుంటున్నారు. ఇది గమనించిన ఎస్‌ఎఫ్‌ఐ ఎస్వీయూ కార్యదర్శి వినోద్‌కుమార్ తక్షణమే ఈ విషయాన్ని కాలేజీ వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి శాసీ్త్రయ, మేధోపర అభివృద్ధికి ఆయువుపట్టుగా ఉన్న పరిశోధక విద్యార్థులకు గదులు కేటాయించకపోవడం అత్యంత దారుణమన్నారు. నేటికీ కొంతమంది ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందినా వారి చాంబర్లను వీడకపోవడం విచారకమని మండిపడ్డారు. పలు విభాగాలలో అనేక గదులు ఖాళీగా ఉన్నప్పటికీ పరిశోధకులకు గదులు కేటాయించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొంతమంది అధ్యాపకులు పరిశోధకులను అకడమిక్ పనుల కంటే తమ వ్యక్తిగత, ఇంటి పనులకు వాడుకోవడం, వెట్టిచాకిరి చేయించడం దుర్మార్గమన్నారు. దీనిపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులతో కలిసి సంబంధిత విభాగాల ఎదుట నిరసనకు దిగనున్నట్లు హెచ్చరించారు. ఈ క్రమంలో వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.