
ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శన
తిరుపతి రూరల్ : మండలంలోని వేమూరులో రైతు అయ్యప్ప నాయుడుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం రాయలసీమ రీజియన్ బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్ (బీఆర్‌సీ) ప్రతినిధులు 40 మంది సందర్శించారు. తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్ర రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముగం ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఏటీఎం మోడల్‌లో విత్తనాలు, దేశీయ పద్దతుల్లో నారు నాటారు. అనంతరం బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, దశపర్ని కషాయాలతో పాటు పంచగవ్య తయారీ విధానాలను అధ్యయనం చేశారు. చెరుకు సాగులో వినూత్నంగా ఆకుకూరలు, కూరగాయలు విత్తనాలు నాటారు. బీడు భూముల్లో పీఎండీఎస్ విత్తనాలను చల్లారు. పూర్తిస్థాయిలో కషాయాల తయారీ విధానాలను రైతు అయ్యప్ప నాయుడు క్షుణ్ణంగా వివరించారు. ప్రాజెక్టు అడిషనల్ డీపీఎం పట్టాభిరెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, జిల్లా రిసోర్స్ పర్సన్లు నాగరాజు, నరేంద్ర పాల్గొన్నారు.