శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 28 వేల మంది భక్తులు ముక్కంటీశుని దర్శించుకుని ఉంటారని ఆలయాధికారులు అంచనా వేశారు. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్లు 703, రూ.200 ప్రత్యేక దర్శనం టికెట్లు 3,180, రూ.50 శీఘ్రదర్శనం టికెట్లు 5,008 విక్రయించినట్టు పేర్కొన్నారు. రూ.500, రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5వేలు టికెట్లు కొని 5,701 మంది భక్తులు రాహు–కేతు పూజలను చేయించుకున్నట్టు వెల్లడించారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 24,230 అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.
వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణోత్సవం
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ గడియల్లో అర్చనలు చేశారు. సాయంత్రం తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆలయానికి చేరుకున్న ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్యులు పర్యవేక్షించారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ సేవా సంఘం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 91,720 మంది స్వామివారిని దర్శించుకోగా 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
భాషా పండితులకు అన్యాయం
తిరుపతి ఎడ్యుకేషన్ : వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన భాషా పండితులకు చేపట్టిన బదిలీ ప్రక్రియలో పండిట్లకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం (ఎస్‌ఎల్‌టీఏ) ఉమ్మడి చిత్తూరు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దొడ్డ ఉమామహేశ్వర్, సిబ్బాల కిరణ్‌కుమార్ వాపోయారు. బదిలీ ప్రక్రియలో సీనియారిటీ జాబితాకు అనుగుణంగా ప్రాధాన్యత దృష్ట్యా వెబ్ ఆప్షన్ పెట్టుకున్న సీనియర్లకు దూరంగా, సీనియారిటీ జాబితాలో అట్టడుగున వున్న వారికి సమీప పాఠశాలలు కేటాయించడం దుర్మార్గమని తెలిపారు. దీంతో సీనియర్లు మానసిక ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. తక్షణమే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించిన బదిలీ ప్రక్రియను రద్దు చేసి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్లకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి రెండేళ్లకు బదిలీల్లో స్థానభ్రంశానికి గురవుతున్న వీరికి శాశ్వతంగా న్యాయం చేసేందుకు పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ముక్కంటీశుని ఆలయం కిటకిట

వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణోత్సవం