
ఆంక్షల సంకెళ్లు
విద్యా హక్కు..
● బ్రిటీష్ పాలనను తలపిస్తున్న కూటమి పాలన ● నిన్న విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల రాకపై నిషేధం ● నేడు కళాశాలల్లోకి సైతం అనుమతిలేదని జీఓ ● 9న రౌండ్ టేబుల్ సమావేశానికి సిద్ధమైన విద్యార్థి సంఘాలు
విద్యతోపాటు విలువలతో కూడిన అత్యుత్తమ సంస్కారం అందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న విద్యావేత్తల ఆశయాలతో రూపు దిద్దుకుంది మన విద్యావిధానం. అయితే క్షేత్రస్థాయిలో విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చేందుకు కూటమి సర్కారు విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తోంది. ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోంది. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకూ సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష్య సాధింపు చర్యలో భాగంగా ఆంక్షలు విధిస్తూ వేధింపులకు దిగుతోంది. గత నెలలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలకు అనుమతులు ఇవ్వవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు కళాశాలలోకి రాకూడదంటూ మరో జీఓ
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, అధిక ఫీజులు వసూలు, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, సమస్యలపై విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యార్థులు మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం మరోసారి జూనియర్ కళాశాలలోకి సైతం విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ జీఓ జారీ చేసింది. దీని వెనుక కొన్ని ఏళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ వారి కడుపుకొట్టి రూ.వేల కోట్ల విద్యా వ్యాపారం చేస్తూ ప్రస్తుతం మంత్రి వర్గంలో ఆమాత్యులుగా కొనసాగుతున్న వ్యక్తి హస్తం ఉన్నట్లు విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, భవిష్యత్త్ కార్యాచరణను నిర్ణయించి భారీ స్థాయిలో ఉద్యమాలకు పిలుపునిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.
ఆంక్షలు అందుకేనా?
యువగళం పాదయాత్ర హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడం.
ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రశ్నించడం.
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలపై నిలదీయడం.
పాఠశాలల విలీనంతో ప్రాథమిక విద్య నిర్వీర్యమవుతోందని గళం విప్పడం.
పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రను అడ్డుకోవడం.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను ముట్టడించడం.
పాఠశాలల, కళాశాలలో ప్రవేశాలను నీరుగార్చే కుట్రను ఛేదించడం.