
ఇళ్లు కూల్చివేతే అభివృద్ధా..?
ఇళ్లను కూల్చి వేస్తున్న జేసీబీ
రేణిగుంట:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి అభివృద్ధి మాట పక్కన పెట్టి, పేదల ఇళ్లు కూల్చివేతే అజెండాగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకోవడమే పేదలు చేసుకున్న నేరంగా పరిగణించి, ఎటువంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా పచ్చ నాయకులు చెప్పిందే వేదంగా రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారు. అందులో భాగంగా రేణిగుంట మండలంలో వారం రోజుల వ్యవధిలో గత ప్రభుత్వంలో పేదలు నిర్మించుకున్న 100 ఇళ్లకు పైగా నేలమట్టం చేశారు. రేణిగుంట మండలంలోని జీ పాళెం పంచాయతీ పద్మానగర్‌లో గత ప్రభుత్వంలో 77 మంది పేదలు నిర్మించుకున్న రేకుల ఇళ్లను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గురువారం తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ జయ కృష్ణ, వీఆర్వోలు, పోలీసుల బందోబస్తు నడుమ జేసీబీలతో కూల్చి వేయించారు. ఎక్కడెక్కడో కూలి పనులు చేసుకుంటున్న బాధితులు ఇళ్లు కూల్చివేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని నివాసాల వద్దకు చేరుకుని రెవెన్యూ అధికారులను ఎంత బతిమాలినా వారు తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు.
వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించుకోవడమే నేరమా?
గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే సూచనల మేరకు రెవెన్యూ అధికారులు మాకు స్థలం ఇచ్చారు. అప్పు చేసి రేకుల ఇల్లు వేసుకున్నాం. కానీ సదుపాయాలు లేకపోవడంతో కాపురం ఉండకుండా బాడుగ ఇంట్లో ఉంటున్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇల్లు కూల్చివేశారు.
–అమ్ములు బాధితురాలు పద్మ నగర్, రేణిగుంట
మాకు చావే శరణ్యం
అప్పు చేసి కట్టుకున్న ఇల్లును నేలమట్టం చేశారు. కనీసం మాకు ముందుగా చెప్పి ఉంటే ఇంట్లో పనికొచ్చే సామాన్లను తీసుకొని ఉండేవాళ్లం. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా కూల్చివేయడం దారుణంగా ఉంది. ఇప్పుడు ఇల్లు లేదు అప్పు మాత్రం మిగిలింది ఇక మాకు చావే శరణ్యంగా మిగిలింది.
– రమ్య, బాధితురాలు పద్మా నగర్, రేణిగుంట
ప్రజా అవసరాల కోసమే
పద్మానగర్‌లోని లేఅవుట్‌కు సంబంధించి ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చి వేశాం. పాఠశాల, పార్కు వంటి సదుపాయాల కోసం పంచాయతీకి స్థలాన్ని స్వాధీనం చేస్తున్నాం.
– చంద్రశేఖర్ రెడ్డి, తహిసీల్దార్ రేణిగుంట
కూటమి ప్రభుత్వం పేదలపై కక్ష
పేదలకు చెందిన 77 ఇళ్లు నేలమట్టం
జేసీబీకి అడ్డుగా కూర్చున్న బాధితులు
పోలీసుల బందోబస్తుతో ఇళ్లు కూల్చివేత
జేసీబీకి అడ్డుగా కూర్చున్న బాధితులు
తమ ఇళ్లను కూల్చివేస్తున్నారన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న బాధితులు జేసీబీకి అడ్డుగా కూర్చున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ అప్పుచేసి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోమని భీష్మించుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు బాధితులను ఇలా చేస్తే మీపై కేసులు నమోదు చేయాల్సి వస్తుందని బెదిరించి వాళ్లను అడ్డు తప్పించి, ఇళ్లు కూల్చివేశారు.

ఇళ్లు కూల్చివేతే అభివృద్ధా..?

ఇళ్లు కూల్చివేతే అభివృద్ధా..?

ఇళ్లు కూల్చివేతే అభివృద్ధా..?

ఇళ్లు కూల్చివేతే అభివృద్ధా..?

ఇళ్లు కూల్చివేతే అభివృద్ధా..?