
రైతు సేవలకు దూరంగా కేంద్రాలు
● పేరు మార్చి నీరుగార్చే కుట్ర ● కుదింపునకు యత్నాలు
తిరుపతి అర్బన్ : రైతులు నివాసం ఉంటున్న గ్రామాల్లోనే అన్నదాతలకు అవసరమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చారు. దీంతో రైతులు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామంలోని ఆర్బీకేల్లో ఈ–క్రాప్ నమోదు, ఈకేవైసీ, ధాన్యం కొనుగోలు, పశువులకు దాణా, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలతో పాటు వివిధ వ్యవసాయ పరికరాలు , రైతులకు పలు రకాల విత్తనాలు, ఎరువులు రాయితీలతో అందించడంతో పాటు పంటకు పదే పదే వచ్చే తెగుళ్ల నివారణకు సూచనలు సలహాలు ఇచ్చేవారు. ప్రత్యేకంగా కియోస్క్ (డిజిటల్ టచ్ స్క్రీన్) యంత్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇళ్ల వద్దకే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేవారు. అన్నదాతలకు ఎన్నో విధాలుగా సేవలు అందించే ఈ కేంద్రాలను కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా పక్కన పెట్టిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గత ప్రభుత్వం చేసిన మంచిని రూపుమాపాలని..
గత ప్రభుత్వం రైతులకు చేసిన మంచిని రూపుమాపే దిశగా కూటమి సర్కారు వ్యవహరిస్తోందని పలువురు రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో 445 రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేయడంతో పాటు వాటిని రేషలైజేషన్ పేరుతో మూడు రైతు సేవా కేంద్రాలను ఒకటిగా మార్పు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలో 691 సచివాలయాలను కూటమి ప్రభుత్వం రేషలైజేషన్ పేరుతో 353 చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రైతు సేవా కేంద్రాల తగ్గింపు ఉంటుందని చర్చ సాగుతోంది. 165 కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు లేరు. ఇటీవల అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కావడానికి ఈకేవైసీ చేయించుకోవాల్సిన సంగతి తెలిసిందే. అయితే 2500 మందికి పైగా రైతులు ఈకేవైసీ చేయించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అవసరం అయిన మేరకు అగ్రికల్చర్ అసిసెంట్లు అందుబాటులో లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. క్లస్టర్ల పేరుతో 140 నుంచి 145 రైతు సేవా కేంద్రాలు మాత్రమే ఉండనున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈనెల చివరికి స్పష్టత రానుంది. ఇలా చేస్తే రైతులకు మళ్లీ మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని రైతులు భావిస్తున్నారు.