
పులివెందుల ఘటన అరాచకానికి పరాకాష్ట
వెంకటగిరి (సైదాపురం) : కూటమి అరాచక పాలనకు హద్దు లేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ గూండాలు దాడి చేసిన ఘటన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా..? లేక వేరే దేశంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. టీడీపీ పరాకాష్టకు ప్రజాస్వామ్యంలో ప్రజలు బతికిబట్టకట్టడం కష్టతరంగా మారిందన్నారు. శాసన మండలి సభ్యుడికే పోలీసులు ఎటువంటి రక్షణ ఇవ్వకపోవడంపై సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను భయాందోళనకు గురిచేసి గెలవాలనుకోవడం హేయమైన చర్య అన్నారు. అధికార మదంతో ఎల్లో సైకో బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్తులో స్వేచ్ఛాయుత ఎన్నికలకు గొడ్డలిపెట్టుగా మారుతోందన్నారు. ఎన్నికల కమిషనర్ తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని రామ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
9,11 తేదీల్లో చైన్నె మెమో రద్దు
నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు ఈనెల 9, 11 తేదీలలో రాకపోకలు పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వేస్టేషన్ మేనేజర్ చిరంజీవి శుక్రవారం తెలిపారు. పలు ప్రాంతాల్లో రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా మెమో రైలు రద్దు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించినట్లు రైల్వేస్టేషన్ మేనేజర్ వెల్లడించారు.
23న జాతీయ అంతరిక్ష దినోత్సవం
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌తో పాటు దేశంలోని ఇస్రో సెంటర్‌లలో ఈనెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. 2023 జులై 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని నిర్వహించి ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రుడి ఉపరి తలంపై దక్షిణ ధృవం ప్రాంతంలో దించి చరిత్ర సృష్టించడంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా 2024 జులై 23న ప్రకటించి గత ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 23 దాకా జాతీయ అంతరిక్ష దినోత్సవాలను దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాల్లో నెలపాటు జరుపుకున్నారు. అంటే మొట్ట మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది రెండో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీమూలస్థాన ఎల్లమ్మ పాలక మండలికి దరఖాస్తులు
చంద్రగిరి: చంద్రగిరి గ్రామదేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి 20 రోజుల లోపు దేవాదాయ ధర్మదాయశాఖ జిల్లా కార్యాలయంలో నేరుగా కానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్ కాపీ, రెండు పాసుపోర్టు సైజ్ ఫొటోలు, అఫిడవిట్ జతపరచాలని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 65,234 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,133 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

పులివెందుల ఘటన అరాచకానికి పరాకాష్ట