
ముగ్గురు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతి మంగళం : ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను శుక్రవారం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీలు ఎండీ షరీఫ్, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ టీ. విష్ణువర్ధన్ కుమార్ బృందం స్థానిక ఎఫ్‌బీఓ కె.వేణుగోపాల్‌తో కలిసి శుక్రవారం కూంబింగ్ చేపట్టారు. సత్యవేడు అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున జంబుకేశ్వరపురం నీలగిరి తోట వద్ద రెండు మోటారు సైకిళ్లతో కొంత మంది వ్యక్తులు కనిపించగా వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారిలో కొందరు పారిపోయారన్నారు. అయితే ముగ్గురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారు సమీపంలో దాచిన 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.