
రెండో రోజు కొనసాగిన ఫుడ్ సేఫ్టీ దాడులు
● 17 బృందాలు, 35 స్వీట్స్ అండ్ బేకరీల్లో శాంపిల్స్ సేకరణ
తిరుపతి క్రైమ్/ తిరుపతి తుడా : నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు, కొలతల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం స్వీట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. జాయింట్ ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 17 బృందాలుగా అధికారులు విడిపోయి.. నగరంలోని 35 స్వీట్స్ అండ్ బేకరీస్‌లో తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల తినుబండారాల శాంపిల్స్ సేకరించారు. వీటిని లాబొరేటరీకి తరలించి వచ్చే రిజల్ట్‌ను బట్టి చర్యలు ఉంటాయని తెలిపారు. చాలా చోట్ల స్వీట్లు అన్నీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా కనిపించడంతో వారందరికీ నోటీసులు జారీ చేశారు. నిలువ ఉంచిన పాడైపోయిన 75 కేజీల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వివిధ జిల్లాల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార భద్రత, కల్తీ నియంత్రణ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.