
దళారుల దయకొదిలేసింది..!
● ఎంటీయూ 1010 ధాన్యం కొనుగోలుపై సర్కారు చిన్నచూపు ● నెమ్ము పేరుతో బస్తాకు 5 కిలోలు నొక్కుడు ● విలవిల్లాడుతున్న అన్నదాత
పెళ్లకూరు: జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 80 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో 50 వేల ఎకరాల్లో 1010 వరి రకం సాగులో ఉంది. అ యితే ఈ రకానికి డిమాండ్ లేదని కొనుగోలుదారు లు, వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. మరో వైపు వ్య వసాయ శాఖ అధికారులు ఖరీఫ్ సీజన్‌లో తాము ధాన్యం కొనుగోలు చేయడం లేదని చేబుతున్నారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ముమ్మరంగా కోతలు
ఆరుగాలం కష్టపడి పండించిన వరిపైర్లు కోత దశకు రావడంతో ప్రస్తుతం రైతులు ముమ్మరంగా వరి నూ ర్పిడి పనులు చేస్తున్నారు. అయితే పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకపోవడం, ఎంటీయూ 1010 రకం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున గిట్టుబాటు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. కొందరు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్లుపైన, కళ్లాల్లో ధాన్యం ఆరబెడుతున్నారు. గత జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఈఏడాది ఎరువులు, పురుగు మందులు, వ్యసాయ కూలీల రేట్లు పెరగడంతో ఎకరం సాగుకు గతంలో రూ.25 వేలు పెట్టుబడులు ఉండగా ప్రస్తుతం రూ.35 వేలుకు చేరుకుంది. పెళ్లకూరు, చెంబేడు, చిల్లకూరు, పునబాక, నెలబల్లి, కలవకూరు, చావలి, నందిమాల తదితర గ్రామాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. అయితే రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకుండా దళారులు రైతులను దోచుకుంటున్నారు. రైతులు వ్యవసాయానికి చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ధాన్యం కళ్లాల్లోనే తక్కువ ధరలకు దళారులకు విక్రయిస్తుండడం గమనార్హం.
పెళ్లకూరులో వరి కోత కోస్తున్న యంత్రం
తవుడు కన్నా ధాన్యం ధర తక్కువ
రైతులు పండించిన ధాన్యానికి కూటమి ప్రభు త్వం గిట్టుబాటు ధర ప్రకటించకపోవడంతో ఎంటీయూ 1010 రకం 80 కిలోల బస్తాపై 5 కిలోలు నెమ్ము తొలగించి, కేవలం రూ.1,370కి దళారులు కొనుగోలు చేస్తున్నారు. కాగా 80 కిలోల తవుడు (వరి పొట్టు)ధర రూ.2,160కు పాడి రైతులు కొనుగోలు చేసుకుంటున్నారు. రైతులు పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన ధాన్యం ధర కంటే తవుడుకు గిరాకీ ఎక్కువగా ఉండడం విశేషం. గత జగనన్న ప్రభుత్వంలో ఎంటీయూ–1010, ఎన్‌ఎల్‌ఆర్–145, ఆర్‌ఎన్‌ఆర్‌ఎం–7, ఎన్‌ఎల్‌ఆర్ 34449, బీపీటీ–5240, ఎన్‌ఎల్‌ఆర్–33358, ఎన్‌ఎల్‌ఆర్ 33057 ధాన్యాలను గ్రేడ్–ఏ రకంగా గుర్తించి క్వింటాల్ రూ.2,350 మద్దతు ధర ప్రకటించారు. అలాగే ఎంటీయూ–1001, సీఆర్–1009, ఎన్‌ఎల్‌ఆర్–34242, ఏడీటీ–37, ఎన్‌ఎల్‌ఆర్– 286000 రకాలను సాధారణ రకంగా గుర్తించి క్వింటాల్ రూ.2,300 మద్దతు ధర ప్రకటించారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎంటీయూ1010కి గి ట్టుబాటు ధరపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. రైతులను ఆదుకుంటాం, నాణ్యత లేని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకుంటామని చెప్పిన సీఎం చంద్రబాబు అబద్దాలకు ఇది మరో నిదర్శనం.
పౌరసరఫరాల శాఖ అధికారులకు విన్నవించాం
వాతావరణ పరిస్థితుల ఆధారంగా పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఎంటీయూ1010 రకం వరి సాగు చేశారు. కానీ సన్నరకం వరి సాగు మాత్రమే చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అన్నీ ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంటీయూ1010 రకం ధాన్యం కొనుగోలు విషయమై పౌరసరఫరాలశాఖ అధికారులకు విన్నవించాం. –నాగార్జున సాగర్, ఏడీ,
వ్యవసాయశాఖ, నాయుడుపేట డివిజన్
దళారులకే విక్రయిస్తున్నాం
రైతులు పండించిన ధాన్యం అధికారులు కొనుగోలు చేయకపోవడం, గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం వల్ల చివరికి తక్కువ ధరలకు దళారులకే విక్రయాలు చేస్తున్నాము. ఈఏడాది ధాన్యం ఆరబెట్టుకోవడానికి కనీసం టార్పాలిన్ పట్టలు కూడా పంపిణీ చేయడం లేదు.
–సుబ్రమణ్యంనాయుడు, యాలకారికండ్రిగ
ఎంటీయూ 1010 రకానికి మద్దతు ధర కల్పించాలి
కష్టపడి పండించిన ఎంటీయూ 1010 రకం ధాన్యానికి ప్రభు త్వం మద్దతు ధర ప్రకటించి దళారులు స్వా హా చేయకుండా కొనుగోలు చేయాలి. కష్టపడి పండించిన ధాన్యం తక్కువ ధరకే విక్రయించడంతో నష్టాలు వస్తున్నాయి.
–పరంధామనాయుడు, లక్ష్మీనాయుడుకండ్రిగ

దళారుల దయకొదిలేసింది..!

దళారుల దయకొదిలేసింది..!

దళారుల దయకొదిలేసింది..!