
రైల్వే ప్రయాణికుల భద్రతే లక్ష్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రైల్వే ఆస్తుల రక్షణతో పాటు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పనిచేయాల్సి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠా కూర్ పేర్కొన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా గురువారం ప్రధాన రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ప్రధానంగా ఆయా స్టేషన్లలో స్థానిక పోలీసుల సహకారంతో ఆర్పీఎఫ్ అధికారులు నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంలోని భద్రతా ప్రణాళికపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో సీసీ టీవీ పర్యవేక్షణ వ్యవస్థ, బ్యాగేజ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు వంటి ఆధునిక భద్రతా పరికరాల ఆవశ్యకతపై చర్చించారు. అనంతరం రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్‌కుమార్ జైశ్వాల్, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాలరెడ్డి, ఆర్పీఎఫ్ సీఐలు సందీప్‌కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
13న ఖాళీ ప్లాస్టిక్ టిన్ల ఈ వేలం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ ప్లాస్టిక్ టిన్లు ఈనెల 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేయనున్నా రు. ఈ మేరకు గురువారం టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877–2264 429 నంబరులో కార్యాలయం వేళల్లో, లేదా టీటీ డీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.