
అపచారాలు ఎత్తిచూపితే నాస్తికులైపోతారా?
● టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం
తిరుపతి మంగళం: టీటీడీలో జరుగుతున్న అనర్థాలు, అపచారాలను ఎత్తి చూపితే నాస్తికులైపోతారా? అని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్‌నాయుడిని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొల్లినేని రాజగోపాల్‌నాయుడు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ పదిహేను నెలల కాలంలో టీటీడీలో అన్నీ అపచారాలు, ఘోరాలు తప్ప ఒక మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. టీటీడీలో సంపూర్ణ ప్రక్షాళన చేస్తానని చెప్పి శ్రీవాణి ట్రస్టు, తొక్కిసలాట, గోవుల మృతికి సంబంధించి తమపై ఆరోపణలు చేసి, కాలం గడపతమే తప్ప ప్రక్షాళన విషయంలో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ వైఎస్సార్‌సీపీపై, తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, తనపై నిత్యం విషం చిమ్మే మీ చానళ్లలో నిరంతరం డిబేట్‌లు పెట్టి తాను నాస్తికుడనని, క్రైస్తవుడినని, అవినీతిపరుడనని, టీడీఆర్ బాండ్లులో రూ.వేల కోట్లు దండుకున్నానని విష ప్రచారం చేయడమే తప్ప ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. నాస్తికునికి, క్రైస్తవునికి మధ్య తేడా తెలియని బీఆర్ నాయుడు తిరుమలలో ఏఐ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తారో అర్థం కావడంలేదన్నారు. తనపై మీ అభాండాలన్నీ అబద్ధాలు అయినందున మీ భజన నాయుడితో తిట్టించడం తప్ప, మీరు చేసి ఒక మంచి పని చెప్పండి బొల్లినేని రాజగోపాల్‌నాయుడు అని నిలదీశారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తానని ప్రగల్భాలు పలికారు.. శ్రీవాణి లేకపోతే రాష్ట్రంలో, దేశంలో ఆలయాలు కట్టగలరా? అని ప్రశ్నించారు. తాము తీసుకున్న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు నిర్ణయం అత్యద్భుతమైనదని, దానిని మీరు రద్దు చేయలేరన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైందన్నా రు. ఏఐ టెక్నాలజీతో దర్శనం కల్పిస్తామని చెప్పిన బీఆర్ నాయుడు బోర్డు సమావేశంలో మూడో కాంప్లెక్స్ నిర్మా ణం నిర్ణయం ఎందుకని ప్రశ్నించారు. టీటీడీలో మీ మాట చెల్లదని, మీ మాట వినే అధికారులెవరూ లేరన్న విషయం దేశమంతా కోడై కూస్తోందన్నారు.
మీ చేతగానితనానికి నిదర్శనం
మఠాలకు నోటీసులు ఎందుకు ఇచ్చారని, మఠాధిపతులను అవమానించకండని మాట్లాడినందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. మఠాధిపతులేమైనా మీ దృష్టిలో తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. గతంలో కరుణాకరరెడ్డి అరెస్టయ్యారంటూ తానేదో నేరం చేసినట్లు చెబుతున్నారని, అయితే అతి చిన్నవయసులోనే సమాజం కోసం జైలుకు వెళ్లినందుకు గర్వపడుతున్నానన్నా రు. వైకుంఠ టోకెన్ల జారీలో తొక్కిసలాట కారణంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పమన్నారన్న కక్షతో పవన్‌కళ్యాణ్‌కు సన్నిహితులైన శ్రీనివాసమంగాపురంలోని బాలాజీ దీక్షితులు, అదే సామాజిక వర్గానికి చెందిన చీర్ల కిరణ్‌కు మెమోలు ఇచ్చారే తప్ప వారు మరో తప్పిదాలేమీ చేయలేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు వచ్చాకే తిరుమల పవిత్రత మంటగలిసిందని, అనేక అపచారాలతో టీటీడీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.