
వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటులో ఆలస్యమెందుకు?
● పార్లమెంటులో ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి మంగళం : నగరంలో సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినప్పటికీ, దాని ఏర్పాటు ఎందుకు ఆలస్యమవుతోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. బుధవారం పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఏడాది కిందట తిరుపతిలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటును ప్రకటించినా సిబ్బంది నియామకం ఆలస్యంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. నిర్వాహక లోపాల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవలు అందకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో నియామకాలు జరిగేలోగా తాత్కాలిక ఒప్పంద సిబ్బంది ద్వారా తిరుపతి సీజీహెచ్‌ఎస్ కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే తిరుపతి జిల్లా శ్రీసిటీ, నెల్లూరులో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రులు కూడా ఇప్పటివరకు భూమిపూజ స్థాయికి కూడా రాలేదని చెప్పారు. కేంద్రం నుంచి మంజూరు అయినప్పటికీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని విమర్శించారు. తిరుపతి జిల్లాలో సత్యవేడు, తిరుమల, నాయుడుపేట, వరదయ్యపాళెం, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని, వాటి ప్రారంభం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరోగ్య పరిరక్షణ అందించే ఈ సౌకర్యాలు ఆలస్యం కావడం బాధాకరమన్నారు.
ఎంపీ చొరవతో ఇరకం, రాయదొరువుకు సాంకేతిక సేవలు
తడ: ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవతో సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని ఇరకం దీవి, పూడి రాయదొరువు గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సెల్ టవర్లు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. తీర ప్రాంత గ్రామాలైన ఈ రెండు చోట్ల సెల్‌ఫోన్లకు సిగ్నల్ లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్లు, రేషన్ సరుకుల పంపిణీ, ఇతరత్రా ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు పని చేయకపోవడంతో ఇక్కడ ఆఫ్‌లైన్ ద్వారానే సేవలు కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో ఏవైనా హెచ్చరికలు, ప్రభుత్వ అధికారుల ద్వారా ముఖ్యమైన సమాచారం ఇవ్వాల్సి వచ్చినా ఫోన్, నెట్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికుల నుంచి ఈ సమస్యలు తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా 4జీ టవర్లు ఏర్పాటు ప్రాజెక్టులో భాగంగా ఇరకం దీవి, పూడి రాయదొరువు గ్రామాలను ఎంపిక చేయాలని కోరారు. గతంలో దీనికి బీఎస్‌ఎన్‌ఎల్ అంగీకారం తెలిపినా ఈ రెండు ప్రాంతాలు ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఉన్నందున అటవీ శాఖ, పర్యావరణ అనుమతులు అవసరం కావడంతో టవర్ల ఏర్పాటుకు అడ్డంకి ఏర్పడింది. దీనిపై తిరుపతి ఎంపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో అటవీ శాఖ అనుమతులతోపాటు పూడిరాయదొరువు టవర్‌కి అవసరమైన విద్యుత్ కనెక్షన్ ఏర్పాటులో ఉన్న సమస్యలను అధికారులు ఎంపీకి వివరించారు. ఆ మేరకు అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర సింగ్‌కి లేఖ రాశారు. దీనిపై శాఖా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ తెలిపారు. టవర్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో త్వరలోనే ఈ గ్రామాలకు నాణ్యమైన మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.