
ఏడాదిన్నరగా నేతన్నలపై సర్కారు శీతకన్ను
● మారని చేనేతల జీవితాలు ● ప్రోత్సాహకం లేక అవస్థలు పడుతున్న నేతన్నలు ● గతంలో చేనేతలకు అండగా నేతన్ననేస్తం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
నేతన్న నేస్తం
మోడు బారిన మగ్గం బతుకులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ రంగులు అద్దింది. చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల అభ్యున్నతికి విశేష కృషి చేసింది. చేనేతల జీవితాల్లో వెలుగులు నింపి, ఆధునిక టెక్నాలజీతో నేత పనులు సాఫీగా సాగించుకునేలా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు చేసి చేనేత పరిశ్రమకు ఊపిరిపోశారు. ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాలకు అండగా నిలిచారు. గత ప్రభుత్వం ఈ పథకం కింద అర్హత కలిగిన చేనేత కుటుంబానికి రూ.24వేలు ఒకే సారి నేరుగా వారి బ్యాంకు ఖాతాకే జమ చేస్తూ వచ్చింది. గత ప్రభుత్వం ఐదు విడతలు నేతన్న నేస్తం డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసింది. దీంతో ఒక్కో నేత కార్మికుడు రూ.1.20 లక్షలు లబ్ధిపొందాడు. దీంతో నేతన్నల జీవనం మెరుగుపడింది.
సైదాపురం/వెంకటగిరిరూరల్: కూటమి సర్కారు నిర్లక్ష్యంతో చేనేత నేత కార్మికుల జీవితాలు కుదేలవుతున్నాయి. ఏడాదిన్నర తరువాత తీరిగ్గా ఈ నెల 7 తేదీన హామీల అమలుకు జీఓ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఆ సాయం ఎప్పటికి అందుతుందో తెలియక నేతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక చీర తయారీకి కుటుంబ సభ్యులందరూ రోజంతా కష్టపడాల్సివస్తోంది. చేసిన కష్టానికి తగిన కూలీ గిట్టుబాటు దక్కకపోవడంతో కుటుంబ నిర్వహణ కష్టతరం అవుతుందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, విద్యుత్‌చార్జీలు, ఇంటి అద్దె, పిల్లలు ఫీజులుతోపాటు కుటుంబ నిర్వహణ ఖర్చులకు సరిపడా సంపాదన లేక నేతన్నల జీవనం గడవడం కష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూపులు తప్పడంలేదని పలువురు చేనేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నేత కార్మికులకు సరైన ప్రోత్సాహం, ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసపోవడమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
నేతన్నలు ఆధునిక బాట
చేనేత పరిశ్రమ అభివృద్ధికి గత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద క్లస్టర్లుగా డెవలప్‌మెంట్ కార్యక్రమం చేపట్టింది. దీంతోపాటు నూలు కొనుగోలు నుంచి తయారైన చీరలను మార్కెటింగ్ చేసే వరకు ప్రభుత్వం అన్ని దశల్లోనూ సహకారం అందించింది. ఫలితంగా చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందారు. వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి వైరెటీ డిజైన్లు ఆధునాతన చీరలు నేసేందుకు అవసరమైన డిజైన్‌లు, 240 హుక్స్ మోటరైజ్డ్ లిఫ్టింగ్ డైవ్స్, ఐరన్ ప్రేమ్‌లూమ్స్‌లాంటి మిషన్లు, మోటార్లు తదితర పరికరాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసి, నేనున్నానని భరోసా ఇచ్చింది. అధునాతన వస్త్రాలను నేసేందుకు చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఆప్కో ద్వారా వస్త్రాల కొనుగొలు చేయించింది. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి రూ.25 వేల సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. 2022–23లో తిరుపతి జిల్లాలో 255 మంది చేనేత కార్మికులకు రూ.1.76 మంజూరు చేయగా, 2023–24లో వందలాది మందికి ఈ పథకం అందజేసింది.
ఉచిత విద్యుత్ అమలులోనూ కోతలే
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దాని అమలులోనూ కోతలు విధిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు తప్ప నేతన్నలకు పెద్దగా లబ్ధి లేదన్నది తేటతెల్లమవుతోంది. హ్యాండ్‌లూమ్‌కు 200 యూనిట్లు, పవర్ లూమ్‌కు 500 యూనిట్స్ చొప్పున విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు ఆ హామీ అమలుకు ఉత్తర్వులిచ్చారు. సర్వేలు, వడపోతల పేరిట కాలయాపన చేసి ఇప్పటివరకు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. తాజాగా ఈ నెల 7వ తేదీన అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉచిత విద్యుత్ అర్హుల జాబితాలో కోతలు పెట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత ప్రారంభించనున్న ఈ పథకంలో సొంత చేనేత మగ్గాలు కలిగిన 50 వేల మందికి, మర మగ్గాలున్న 15 వేల మందికి మాత్రమే వర్తించేలా కుదించారు.
నేతన్ననేస్తం అండగా నిలిచింది.
గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్ననేస్తం పథకం కార్మికులకు అండగా నిలిచింది. ఎందరో కార్మికులు దుర్భర జీవితాల్లో వెలుగులు నింపింది. దీంతో ప్రభుత్వం ద్వారా వచ్చే నేతన్ననేస్తం నిధులతో మగ్గాల యాంత్రీకరణ చేయించుకుని ఆధుకనిత వైపు అడుగులు వేశారు. – కూనా మల్లికార్జున్,
రాష్ట్రపతి అవార్డు గ్రహీత, చేనేత కార్మికుడు, బంగారుపేట
చేనేతలను ఆదుకోవాలి
గత జగనన్న ప్రభుత్వంలో ఏటా ఇచ్చిన నేతన్న నేస్తం డబ్బులతో మగ్గానికి అవసరమైన డిజైన్ కార్డులు, జాకార్ట్ యంత్రం, మోటారు కొనుగోలు చేశారు. వృత్తిపరంగా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా చేనేత కార్మికులను ఆదుకోని ప్రత్యేక నిధులు కేటాయించి, అండగా నిలవాలి. –వెంకటేశ్వర్లు, వెంకటగిరి

ఏడాదిన్నరగా నేతన్నలపై సర్కారు శీతకన్ను

ఏడాదిన్నరగా నేతన్నలపై సర్కారు శీతకన్ను

ఏడాదిన్నరగా నేతన్నలపై సర్కారు శీతకన్ను

ఏడాదిన్నరగా నేతన్నలపై సర్కారు శీతకన్ను