చిరుతల సంచారంపై మరోసారి అధ్యయనం
● గతంలో తీసుకున్న నిర్ణయాలే ఆధారం ● తిరుమల అటవీ ప్రాంతంలో అధ్యయనం చేయనున్న సైంటిస్ట్ రమేష్
తిరుమల: చిరుతల సంచారంపై టీటీడీ మరోసారి అధ్యయనం చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత టీటీడీ అధికారులు తిరిగి అమలు చేయనున్నారు. గతంలో ఘాట్ రోడ్లో, నడక మార్గంలో వన్యమృగాలను కట్టడి చేసేందుకు అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకరరెడ్డి సైంటిస్ట్ రమేష్ కమిటీని పిలిపించి అధ్యయనం చేయించారు. ప్రభుత్వం మారడంతో ఆ కమిటీ అధ్యయనం మూలన పడింది. అయితే తిరిగి చిరుతల సంచారం పెరగడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించనుంది.
ఎట్టకేలకు నిద్ర లేచింది
నడక మార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ అటవీశాఖ దృష్టి సారించింది. డెహ్రడూన్‌కు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ రమేష్ సూచనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కాకపోతే ఇది కూడా తమ హయాంలోనే జరిగిందని కలరింగ్ ఇచ్చుకోవడానికి రమేష్‌ను మరోసారి వర్క్‌షాప్ నిర్వహించి నివేదికను టీటీడీకి అందజేసేందుకు పథకం వేసింది.
గతంలోనే పకడ్బందీ చర్యలు
అలిపిరి నడక మార్గంలో 2023 జూన్ 24న ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేయగా అదే ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీన నరసింహస్వామి ఆలయం వద్ద ఆరేళ్ల బాలికపై దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై దృష్టి సారించిన అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకరరెడ్డి సూచనలతో అటవీశాఖ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అలిపిరి నడక మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించకుండా నిలిపివేయడం, సాయంత్రం ఆరు నుంచి ఏడో మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతా సిబ్బంది గస్తీ మధ్య భక్తులను గుంపులుగా అనుమతించడం వంటి చర్యలు చేపట్టారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 250 ట్రాప్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆరు చిరుతలను గుర్తించారు. వన్యప్రాణుల సంచారం పై నిఘా ఉంచడానికి ఏడో మైలు వద్ద అటవీశాఖ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. అటువైపు ఉన్న జింకలను ఇతర ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. నడకదారి భక్తులకు మనోధైర్యం కల్పించేందుకు ఊతకర్రలను అందించారు. డెహ్రాడూన్‌కు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ రమేష్ నేతృత్వంలో చిరుతల సంచారానికి గల కారణాలపై చర్చించారు. వారి నివేదిక సమర్పించే సమయానికి ప్రభుత్వం మారింది. మరోవైపు అప్పటి అధికారులు తీసుకున్న చర్యలతో చిరుతల సంచారం కూడా తగ్గి పోవడంతో సైంటిస్ట్ నివేదికను టీటీడీ లైట్ తీసుకుంది.
మళ్లీ కలకలం
ఈనెల 25వ తేదీన అలిపిరి నడక మార్గంలో 350 మెట్టు వద్ద చిరుత సంచరించడం, అనంతరం మరుటి రోజు మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద వాహనదారులకు సమీపం నుంచి చిరుత వెళ్లడంతో టీటీడీ ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో చిరుత సంచారం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించింది. గతంలో సైంటిస్ట్ రమేష్ ఇచ్చిన నివేదికను మరోసారి టీటీడీకి అందజేయించేందుకు ఆయనతో వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఆయన తిరుమలకు చేరుకుని జూన్ 1, 2 తేదీలలో వర్క్‌షాప్ నిర్వహించి టీటీడీకి నివేదికను సమర్పించేలా అధికారులు ప్లాన్ చేశారు. భద్రతా ఏర్పాట్లను తిరిగి పునఃప్రారంభించేలా టీటీడీ చర్యలు తీసుకుంది.


