తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న రిలాక్స్ వెల్ మాట్రెసెస్ వారు నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ వ్యర్థాలను రోడ్డు పక్కన వేసి కాల్చడాన్ని కలెక్టరు వెంకటేశ్వర్ గురువారం ఉదయం గమనించారు. ఆ పరిశ్రమ యజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలార్పించి, జరిమానాకు పంచాయతీ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ చట్టం కింద సెక్షన్లు 84, 94 మేరకు చెత్త కాల్చిన రిలాక్స్ వెల్ మాట్రెసెస్ వారికి రూ.50వేల జరిమానా విఽధిస్తూ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి నోటీసులు జారీ చేశారు.
భార్యపై కత్తితో దాడి
రేణిగుంట: భార్యపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని సూరప్పకశం పంచాయతీ, అల్లికేశం గ్రామానికి చెందిన మల్లికార్జున (61), ముని లక్ష్మి (58) భార్యాభర్తలు. గురువారం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో భార్య మునిలక్ష్మి మెడపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. గాజులమండ్యం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు.
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో స్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి వస్తువులను శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మునికృష్ణారెడ్డి, ప్రధాన అర్చకుడు ఏపీ శ్రీనివాస దీక్షతులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
తిరుపతి అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో కార్డుల కాలపరిమితిని జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు సంబంధిత మీడియా యాజమాన్యం వారు వారి సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారికి సమర్పించాలని కోరారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. మండల పరిధిలోని బందార్లపల్లి దళితవాడకు చెందిన లోకేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి బందార్లపల్లికి పయనమయ్యాడు. ఈ క్రమంలో పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకేష్ తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున లోకేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెత్త కాల్చినందుకు రూ.50 వేల జరిమానా
చెత్త కాల్చినందుకు రూ.50 వేల జరిమానా
చెత్త కాల్చినందుకు రూ.50 వేల జరిమానా


