బాబు రాజ్యం కాదు.. ఎమ్మెల్యేల రాజ్యం
– సీపీఐ జాతీయ నేత నారాయణ
ఏర్పేడు: రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యం నడవడం లేదని, ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తోందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏర్పేడు మండలం వికృతమాల ప్రభుత్వ గృహ సముదాయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తోందని, వారు నియోజకవర్గాల నుంచి ముడుపుల మూటలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేరవేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పేదల బాగోగులను గురించి ఆలోచించే తీరిక లేదని, ఆయన కార్పొరేట్ బడాబాబులతో బిజీబిజీగా గడుపుతున్నారని ఆరోపంచారు. వికృతమాల సమీపంలో తిరుపతి పట్టణానికి చెందిన ప్రజలకు తుడా ఆధ్వర్యంలో 75 బ్లాకులతో 1,800 మంది పేదలకు ఇళ్లు ఇచ్చారన్నారు. అయితే అక్కడ మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు మళ్లీ తిరుపతికి వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే ఇల్లు ఇక్కడ, రేషన్ కార్డు తిరుపతిలో ఉండడంతో మిమ్మల్ని రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, మీరంతా తిరుపతి నుంచి వికృతమాల పంచాయతీకి రేషన్‌కార్డు, ఓటరు కార్డులను మార్చుకుంటే ప్రభుత్వంతో పోరాడేందుకు సంపూర్ణ హక్కులు కలుగుతాయన్నారు. వికృతమాల పంచాయతీలోని గృహ సముదాయాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్, శ్రీకాళహస్తి, తిరుపతి ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి కార్యదర్శి జనమాల గురవయ్య, వికృతమాల ప్రభుత్వ గృహాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సీహెచ్ శివకుమార్, కమిటీ సభ్యులు గోవర్ధన్, నారాయణ, శ్రీనివాసులురెడ్డి, వరప్రసాద్, గీత, రాధమ్మ, దీప తదితరులు పాల్గొన్నారు.


