సమన్వయంతో అభివృద్ధి చేద్దాం
తిరుపతి అర్బన్: అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన స్వర్ణనారావారిపల్లి...అభివృద్ధి అనే అంశంపై ట్రైనీ కలెక్టర్ రఘువాన్సీతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, రంగంపేట స్కూలు నిర్మాణం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చెందిన పనులు సంక్రాంతిలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సుశీలాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డీఈఓ కేవీఎన్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, డీఏఓ ప్రసాద్‌రావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి తదితరులు పాల్గొన్నారు.
ఒకేరోజు 4 ఇళ్లల్లో చోరీ
– 66.5 సవర్ల బంగారం, రూ. 5 లక్షల నగదు అపహరణ
వెంకటగిరి రూరల్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగలు వెంకటగిరి చెలరేగిపోతున్నారు. ఒకే రోజు పట్టణంలోని వేర్వేరు చోట్ల 4 ఇళ్లల్లో చొరబడి 66.5 సవర్ల బంగారం, పలు విలువైన వస్తువులు, రూ. 5 లక్షల వరకు నగదు అపహరించుకుపోయిన ఘటనలు ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌లోని బెటాలియన్ విశ్రాంత ఎస్‌ఐ బాలకృష్ణ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి తాళం పగులగొట్టి ఇంట్లోని 1.5 సవర్ల బంగారు నగలు చోరీ చేశారు. అదే వీధిలోని బ్యాంకు ఉద్యోగి ఉమ అనే మహిళ ఇంట్లో ప్రవేశించి 2.5 సవర్ల బంగారు నగలు, రూ.20వేలు నగదు అపహరించుకుపోయారు. చాకలివీధిలో ఉంటున్న ఉపాధ్యాయులు రమేష్, సంధ్యారాణి వ్యక్తిగత పనులు నిమిత్తం నెల్లూరుకు వెళ్లి వచ్చే లోపే ఇంటి తాళలు పగులకొట్టి 2 సవర్ల బంగారు నగలు, రూ.35 వేల నగదు చోరీ గురైనట్లు బాధితులు వాపోయారు. అలాగే తోలిమిట్ట ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణయ్య నివాసంలో 63 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు చోరీకి గురైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నాలుగు ఇళ్లల్లో 24వ తేదీ రాత్రి చోరీ జరిగి శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. వెంకటగిరి పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సీఐ ఏవీ రమణ తెలిపారు.
సమన్వయంతో అభివృద్ధి చేద్దాం


