కలకలం రేపిన ప్రొఫెసర్ మృతి
తిరుపతి క్రైమ్ : ఎస్వీయూ ఎంబీఏ విభాగంలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ గుగలోత్ సర్దార్ నాయక్ మృతి కలకలం రేపింది. తన సొంత కారులోనే ఆయన అనుమానాదస్పదంగా మృతి చెందడం పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. గతంలో ఆయన మద్యానికి బానిసై తరగతులకు హాజరుకావడంతో గుర్తించిన అధికారులు పలుసార్లు ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు.
తిరుపతి తుడా: మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా యు శారదాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టిడ్కో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆమెను తిరుపతి కార్పొరేషన్ కు అదనపు కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న చరణ్ తేజ రెడ్డిని రెండు నెలల క్రితం మదర్ డిపార్ట్‌మెంట్ కు పంపిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక అప్పటి నుంచి అదనపు కమిషన్ గా ఎవరిని నియమించకపోవడంతో డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ప్రభుత్వం అదనపు కమిషనర్ నియమించింది.
చిల్లకూరు: గూడూరు వరదానగర్‌లో రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో శుక్రవారం ఓ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒకటో పట్టణ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ కథనం మేరకు.. వరదానగర్ ప్రాంతంలో సుబ్రహ్మణ్యం(34) అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని టైల్స్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతను కొంత కాలంగా అనారోగ్యం బారిన పడి ఉన్నాడు. ఈ క్రమంలో అతను ఉదయం రోడ్డుపైకి నడిచి వస్తుండగా చుట్టు పక్కల వారు గమనించారు. అయితే అతను నడిచి వెళుతూ పక్కకు ఒరిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృత దేహం వద్ద ఉన్న ఆధారాలు మేరకు అతను చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
కలకలం రేపిన ప్రొఫెసర్ మృతి


