రెండో విడతలో అందని గ్యాస్ సబ్సిడీ
● ఆందోళనలో దీపం–2 పథకం లబ్ధిదారులు ● సిలిండర్‌కు చెల్లించిన నగదు రీఫండ్ కాకపోవడంతో ఆగ్రహం ● రోజుకో మాట చెబుతున్న అధికారులు
20 రోజులు గడిచాయి
ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ అని లెక్కవేశారు. అప్పటి వరకు ఒక్క సిలిండర్ సరిపోదు. సరే ఏదో ఇస్తామని చెప్పారు. సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మొదటి సిలిండర్ బుక్ చేసుకుంటే నగదు వేశారు. రెండో సిలిండర్‌కి ఇవ్వలేదు. 20 రోజులు గడుస్తోంది. మా డీలర్‌ను అడిగితే పడుతుందిలే అంటున్నారు. ఎప్పుడు పడుతుందో ఏమో తెలియడం లేదు.
– రత్నమ్మ, శ్రీకాళహస్తి మండలం
చేసింది ఒక్కటే.. అదీ ఇలా..
సూరప్‌సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒక్కటే. అదీ ఇలా సక్రమంగా ఇవ్వకుంటే ఏం చేయాలి. తల్లికివందనం లేదు...అన్నదాత సుఖీభవ లేదు...నిరుద్యోగభృతి లేదు. ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్మాలి. గ్యాస్ సిలిండర్ తీసుకుని 18 రోజులు గడుస్తోంది. అయినా రాయితీ జమ కాలేదు.
– రాణెమ్మ, తిరుపతి
తిరుపతి అర్బన్ :జిల్లాలో దీపం– 2 పథకం అప్పుడే కొడిగట్టుతోంది. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని కూటమి ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో విడత సిలెండర్ బుక్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. మొదటి విడతలో 4.92 లక్షలకు కాను 2.40లక్షలకు మాత్రమే నగదు రీఫండ్ చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. సగం మందికి సొమ్ము చెల్లించలేదని విమర్శిస్తున్నారు. అయితే 50 శాతం మంది మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని, వారికి మాత్రమే నగదు జమ చేశామని అధికారులు వివరిస్తున్నారు. రెండో విడత విషయంలో 90శాతం మందికి రీఫండ్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులేమో సర్వర్, ఆధార్ లింకేజీ సమస్యల కారణంగా ఉచిత గ్యాస్ నగదు జమ కావడంలేదని చేతులు దులిపేసుకుంటున్నారు. తొలి ఏడాదే రెండో విడతకే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే కాలంలో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు రోజుల్లో నగదు జమ చేస్తాం
దీపం–2 పథకం ద్వారా రెండో సిలిండర్ బుకింగ్ చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ అంశంపై మీటింగ్ నిర్వహించారు. ఆ మేరకు రాష్ట్రస్థాయి అధికారులతోను మాట్లాడారు. అయితే నాలుగు రోజుల్లో వేస్తామని చెప్పారు. ఈ విషయంలో లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదు.
– శేషాచలం రాజు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి
డబ్బులు జమ కాలేదు
ఉచిత గ్యాస్ పథకం కింద సిలిండర్ బుక్ చేసుకున్నాం. సిలిండర్ ఇంటికి వచ్చింది. నగదు చెల్లించాం. అయితే మేము కట్టిన డబ్బులు మాత్రం మా బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. మొదటి సారి వచ్చింది. ఈసారి ఎందుకు రాలేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే వస్తుందని చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే రెండు వారాలవుతోంది.
– లక్ష్మి, ఏర్పేడు మండలం
●
రెండో విడతలో అందని గ్యాస్ సబ్సిడీ
రెండో విడతలో అందని గ్యాస్ సబ్సిడీ


