మట్టి మనుషులు
పొలంలో కుళ్లిపోయిన నార్లు
అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాత
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
అన్నదాతలు పుడమి తల్లినే నమ్ముకుంటారు.. ఆరుగాలం కష్టిస్తుంటారు.. చక్కటి దిగుబడి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు.. అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటను కాపాడుకునేందుకు ఆరాటపడుతుంటారు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం స్పందించకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల విరుచుకుపడిన దిత్వా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మడుల్లో వరదనీరు నిల్వ చేరడంతో నార్లు దెబ్బతిని కుమిలిపోతున్నారు. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.
చిట్టమూరు : జిల్లాలోని పలు మండలాల్లో రైతులు దిత్వా తుపాను కారణంగా కుదేలయ్యారు. ఒక్క చిట్టమూరు మండలంలోనే సుమారు 5వేల ఎకరాల్లో వరినాట్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. నారుమడుల్లో ఎక్కువ రోజులు వరద నీరు నిల్వ చేరడంతో నార్లు పాచిపోయి పనికిరాకుండా పోయినట్లు వెల్లడిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు యుద్దప్రాతిపదికన సర్వే నిర్వహించి రైతుభరోసా కేంద్రాల ద్వారా 80శాతం రాయితీతో ఇంటి వద్దకే వరి విత్తనాలు పంపించారని గుర్తుచేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో స్పందించే నాథుడే కరువైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్వవసాయాధికారులు కనీసం పొలాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని వాపోతున్నారు. రాయితీ విత్తనాల సంగతి దేముడెరుగు, అవసరాలకు అనుగుణంగా యూరియా కూడా పంపిణీ చేయలేక చేతులెత్తేశారని మండిపడుతున్నారు. పంటలకు అదును తప్పుతున్నప్పటికీ సర్కారు సాయం అందకపోవడంతో మళ్లీ అప్పులు చేసి సాగుకు సన్నద్ధమవ్వాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులను ముంచేసిన దిత్వా
మట్టి మనుషులు
మట్టి మనుషులు


