నియంత్రణలోనే నేరం
● క్రైమ్ మీటింగ్‌లో ఎస్పీ సుబ్బరాయుడు
● గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా
పెరిగిన క్రైమ్‌రేట్ ● సైబర్ నేరాలతో 2024లో రూ.12.31 కోట్ల నష్టం వాటిల్లగా, అందులో రూ.2.30 కోట్లు మాత్రమే రికవరీ చేశాం. 2025లో నష్టం రూ.14.45 కోట్లకు పెరిగినా, రూ.3.53 కోట్లను బాధితులకు తిరిగి ఇప్పించాం.
● మొబైల్ హంట్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ద్వారా 2024లో 2,003 మొబైళ్లు (రూ.4 కోట్ల విలువ) స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాం. 2025లో ఈ సంఖ్య 2,485కు పెరిగింది. వీటి విలువ సుమారు రూ.4.97 కోట్లు.
● పోక్సో, లైంగికదాడి, హత్య, దోపిడీ వంటి నేరాలకు సంబంధించి 2025లో మొత్తం 23 కీలక కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. వీటిలో పలు కేసుల్లో జీవిత ఖైదు, మరికొన్నింటిలో 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు విధించబడ్డాయి. ఈ ఏడాది 187 మందిపై పోక్సో కేసులు నమోదు చేశాం.
● రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2024లో 497 ఘటనల్లో 541 మంది మృతి చెందారు. 2025లో 474 ప్రమాదాల్లో 513 మంది మృతి చెందారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ–చలానాల ద్వారా 2024లో రూ.6.63 కోట్ల జరిమానా వసూలు కాగా, 2025లో రూ.9.86 కోట్ల జరిమానా వసూలు చేశాం.
● గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ద్వారా 762 కేసులు నమోదు చేసి 179 మందిని అరె స్టు చేశాం. 296 మందిపై గంజాయి షీట్స్ తెరిచాం.
● డయల్–112, పీజీఆర్‌ఎస్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందించాం. ఆధునిక సాంకేతిక వినియోగం, నిరంతర గస్తీ, ప్రజా సహకారంతో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించాం.
తిరుపతి క్రైమ్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల అదుపులో మెరుగైన ఫలితాలు సాధించామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. 2025 వార్షిక నివేదికను ఆయన ఆదివారం మీడియాకు వివరించారు. 2024లో 9,118గా ఉన్న మొత్తం ఎఫ్‌ఐఆర్‌లు 2025లో 9,253కు చేరినట్లు తెలిపారు. అయితే ఈ పెరుగుదల కేవలం 0.71 శాతమేనని స్పష్టం చేశారు. భౌతిక దాడులు 2024లో 1,095గా ఉండగా, 2025లో 1,029తో 6.03 శాతం తగ్గుదల నమోదైందన్నారు. సైబర్ నేరాలు 241 నుంచి 186తో 22.82 శాతం తగ్గినట్లు చెప్పారు. అయితే ఆస్తి సంబంధిత నేరాలు 1,052 నుంచి 1,109కు పెరిగినట్లు వివరించారు. ఆయన మాటల్లోనే..