వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత
తిరుపతి క్రైమ్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల, తిరుపతితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
తిరుపతి క్రైమ్ : నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ప్రజలు న్యూఇయర్ సంబరాలను ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. ఇతరులను ఇబ్బంది పెట్టేలా డీజే సౌండ్లు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టప్రకారం అనుమతులు తీసుకుని మాత్రమే వేడుకలు జరుపుకోవాలని, డీజే సౌండ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
‘పేటశ్రీ’కి మరో విశిష్ట అవార్డు
తిరుపతి కల్చరల్ : ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి(పేటశ్రీ)ని మరో విశిష్ట అవార్డు వరించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పొనకా కనకమ్మ దువ్వూరు రామిరెడ్డి స్మారక అవార్డుకు ఎంపిక చేసినట్లు నెల్లూరు దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ వారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న దువ్వూరు రామిరెడ్డి జయంతి సభలో పేటశ్రీకి రూ.25 వేల నగదుతో పాటు అవార్డును బహూకరించనున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యంలో పేటశ్రీ చేసిన కృషిని గుర్తించి జ్యూరీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పేటశ్రీ 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. గతంలో ఆయన రచించిన తిరుపతి గంగజాతర, కొండ కథలు, తిరువీధులు, తిరుపతి కథలు గ్రంథాలకు సైతం పురస్కారాలు లభించాయి. పేటశ్రీ ఇప్పటి వరకు 300 వ్యాసాలను ప్రచురించారు. చైనా, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండోనేషియా వంటి అనేక దేశాల్లో పరిశోధనా పత్రాలను సమర్పించడం విశేషం.
9న టెన్నిస్ బాల్ క్రికెట్
జిల్లా జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తుమ్మగుంట మైదానంలో జనవరి 9వ తేదీన జిల్లా టెన్నిస్ బాల్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.దేవరాజ్, బి.మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వ్యక్తిగతంగా, జట్టుగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన క్రికెటర్లను జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో జిల్లా జట్టు ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 94902 52821నంబరులో సంప్రదించాలని సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో గ్రీవెన్స్‌కు అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. అర్జీదారులకు మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత


