దారి లేక దీక్ష!
పొలం గట్టుపై తమ కాలనీకి వెళుతున్న గిరిజనులు
దారి కోసం గిరిజనులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సోమవారం ఈమేరకు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగనున్నారు. సూళ్లురుపేట మండలం కడపత్రి పంచాయతీ పాటిమిట్ట గిరిజన కాలనీలో 27 కుటుంబాలవారు సుమారు 50 ఏళ్లుగా నివసిస్తున్నారు. గతంలో బండిబాటనే రాకపోకలకు వాడుకునేవారు. అయితే ఆ బాట కాస్తా ఆక్రమణకు గురికావడంతో కాలనీకి దారి లేకుండా పోయింది. పొలం గట్టే దిక్కుగా మారింది. ఇటీవల అల్లమ్మ అనే మహిళ అనారోగ్యం బారిన పడడంతో ఆస్ప త్రికి తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరకు ఎలాగోలా ఆస్పత్రికి తరలించినా ఆలస్యం కావడంతో ఆమె మరణించింది. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శ్మశానానికి తీసుకెళ్లాలన్నా పొలం గట్టు మీద నుంచే వెళ్లాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు కూడా ఇదే మార్గంలో పాఠశాలకు వెళుతున్నారని, ఈ క్రమంలో అప్పుడప్పుడు పడిపోయి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. దీనిపై ఇటీవల తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు తమ కష్టాలు వినిపించినా ఫలితం లేకుండా పోయిందని వెల్లడిస్తున్నారు. కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో సైతం పలుమార్లు అర్జీలు సమర్పించినా అతీగతీ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. అందుకే సోమవారం నుంచి కలెక్టరేట్ వద్దే ఆమరణ దీక్షకు దిగనున్నట్లు తెలిపారు. తమ కాలనీకి దారి సౌకర్యం కల్పించే వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. – తిరుపతి అర్బన్


