అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులే ఆధారం
తిరుపతి రూరల్ : గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆర్థిక సంఘం నిధులే ఆధారమైనందున పంచాయతీల్లో ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు 16వ ఆర్థిక సంఘం సభ్యులకు విన్నవించారు. తిరుపతి రూరల్ మండలం తవణపల్లి రోడ్డులోని తాజ్ హోటల్‌లో గురువారం గ్రామీణ , పట్టణాల్లో ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సౌమ్య కంటి ఘోష్, ఆర్థిక సంఘం జాయింట్ సెక్రటరీ ఎస్.గౌతమ్ అల్లాడ సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పారిశుద్ధ్యం, రోడ్లు , తాగునీరు, డ్రైనేజీ మొదలగు అంశాలపై ఆర్థిక సంఘం సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. నిధులు పక్కదారి పట్టకుండా ప్రతి గ్రామంలో ఖర్చుచేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని వారు ప్రజా ప్రతినిధులకు సూచించారు. అనంతరం మౌలిక సదు పాయాల కల్పనకు సరిపడా నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించాలని ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. టైడ్ , ఆన్‌టైడ్ నిధులు వేరుగా కాకుండా ఒకే మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి. సంపత్ కుమార్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అడిషనల్ కమిషనర్ ఎం. సుధాకర్‌రావు, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈవో జుబేదా, డీపీఓ సుశీలాదేవి, శ్రీసిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఆర్థిక సంఘం విభాగం అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్‌లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు పాల్గొన్నారు.
జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి
16వ ఆర్థిక సంఘం సభ్యులకు వినతి


