గోనుపల్లి వద్ద ఘోరం!
● బోల్తా పడిన ట్రక్కు ఆటో ● పలువురికి గాయాలు
రాపూరు: మండలంలోని గోనుపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం, పెరింపాడు గ్రామానికి చెందిన కుటుంబీకులు సుమారు 23 మంది రాపూరు మండలం, పెంచలకోనలో జరిగే బ్రహ్మోత్సవాలకు ట్రక్కు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి ట్రక్కు ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న పెరింపాడుకు చెందిన శివయ్య, రాధమ్మ, నారాయణమ్మకు తీవ్ర గాయాలు కాగా.. మరో పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది, పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
గోనుపల్లి వద్ద ఘోరం!


