వైన్ షాపు పర్మిట్‌రూమ్‌లో గొడవ.. యువకుడి మృతి | Young Man Dies After Altercation in Wine Shop Permit Room in Hyderabad | Sakshi
Sakshi News home page

వైన్ షాపు పర్మిట్‌రూమ్‌లో గొడవ.. యువకుడి మృతి

May 3 2025 12:09 PM | Updated on May 3 2025 2:49 PM

Young Man Ends Life In Hyderabad

వైన్ షాపు పర్మిట్ రూమ్‌లో గొడవ 

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

మూసాపేట(హైదరాబాద్): వైన్ షాపు పర్మిట్ రూములో జరిగిన చిన్నపాటి గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన ఆకుల ధనుష్‌ గౌడ్‌ (20) ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఏప్రిల్‌ 5న  తన స్నేహితులు అభినవ్‌ గౌడ్‌ (22), నాగిరెడ్డి(21)లతో కూకట్‌పల్లిలోని దారువాలా వైన్‌ షాపులో మద్యం తాగడానికి వెళ్లారు. 

కావటి కేశవ్‌ (25) మూసాపేటలో ఉంటూ బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కావటి కేశవ్‌ కూడా తన స్నేహితులతో పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగుతున్నారు. అతడిని కొంచెం పక్కకు జరగాలని ధనుష్‌ గౌడ్‌ స్నేహితులు కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తారస్థాయికి వెళ్లింది. కావటి కేశవ్‌ ధనుష్‌ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. ధనుష్‌గౌడ్‌కు కడుపులో బలంగా తగలటంతో అక్కడి నుంచి బయటకు వెళ్లారు. 

మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందంటూ వాళ్ల అమ్మకు చెప్పటంతో వెంటనే కేపీహెచ్‌బీ కాలనీలోని రెమెడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగు పగిలి ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కావటి కేశవ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement