వ్యవసాయ శాఖ అంచనా
వరి 51.48 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.45 లక్షల ఎకరాలు
శనగలు 3.04 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.60 లక్షల ఎకరాలు
యాసంగి కోసం ఎరువులు కేటాయించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే యాసంగి (రబీ)లో 68.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యత తదితర అంశాలను ఆధారంగా చేసుకుని వ్యవసాయ శాఖ ఆయా సీజన్ల సాధారణ సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తుంది.
ఈ క్రమంలోనే తాజా అంచనాలు రూపొందించింది. ఆయా పంటల్లో అత్యధికంగా వరి 51.48 లక్షల ఎకరాల్లో సాగవుతుందని, మొక్కజొన్న 6.45 లక్షల ఎకరాలు, శనగలు 3.04 లక్షల ఎకరాలు, వేరు శనగ 2.60 లక్షల ఎకరాల్లో వేసే అవకాశం ఉందని పేర్కొంది. గత సంవత్సరం (2024) యాసంగి సీజన్‌లో 63.54 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే, ఏకంగా 80.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. దాదాపు 16.50 లక్షల ఎకరాల మేర అధికంగా సాగవగా.. ఇందులో ఒక్క వరి పంట 12.5 లక్షల ఎకరాల్లో వేశారు. గత సంవత్సరం 47.27 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తే.. 59.92 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు.
నత్తనడకన వేరుశనగ, శనగ పంటల సాగు
రాష్ట్రంలో యాసంగి సీజన్ మొదలైనప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సమయానికి లక్ష ఎకరాలు తక్కువగా సాగైంది. వరి కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. సాధారణ సాగు అంచనా 68.67 లక్షల ఎకరాల్లో సాధారణంగా ఇప్పటివరకు 3.35 లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉండగా.. కేవలం 80 వేల ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి.
వేరుశనగ ఇప్పటివరకు 1.30 లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉండగా, కేవలం 35 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. గత సంవత్సరం 1.27 లక్షల ఎకరాల్లో సాగైనప్పటికీ, ఈసారి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నత్తనడకన సాగుతోంది. మొక్కజొన్న కూడా ఇప్పటివరకు సుమారు 40 వేల ఎకరాల వరకు సాగు కావలసి ఉండగా, కేవలం 20 వేల ఎకరాల్లోనే సాగైంది. శనగ పంట ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 వేల ఎకరాల్లోనే సాగైనట్లు వ్యవసాయ శాఖ తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి.
10.40 ఎల్‌ఎంటీల యూరియా కేటాయింపు
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగయ్యే పంటలకు యూరియాతో పాటు ఇతర ఎరువులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత సంవత్సరం రబీ సీజన్‌లో 9.80 ఎల్‌ఎంటీ యూరియా మాత్రమే కేటాయించగా, ఈసారి 60 వేల మెట్రిక్ టన్నులు అదనంగా 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. దీంతో పాటు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 7 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 0.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎమ్‌ఓపీ, 0.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులను యాసంగి సీజన్ కోసం కేంద్రం కేటాయించగా, ఇప్పటికే యూరియాను తెప్పించుకునే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.


