
భర్త అనారోగ్యంతో తీవ్ర మనస్తాపం
వైద్యం కోసం వచ్చి హోటల్‌లో ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్‌లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు వైద్యం చేయించేందుకు వచ్చి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం, లఖింపూర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ అపూర్వ జ్యోతి శర్మ ఆరు నెలలుగా కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతున్నాడు.
భార్య ప్రణిత శర్మ(45), ఆమె సోదరి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్‌లో ఈ నెల 20న చేర్పించారు. ఏఐజీలో చికిత్స తీసుకుంటూ గచ్చిబౌలిలోని బాబుఖాన్ లేన్‌లోని ఆకాశ్ హోటల్ రూమ్ నెంబర్ 303లో ఉంటున్నారు. ఈ నెల 25న సోదరి భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అపూర్వ జ్యోతి శర్మకు ట్రీట్‌మెంట్ పూర్తి కావడంతో మంగళవారం తిరిగి వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి హోటల్‌లో నిద్రకు ఉపక్రమించిన భర్త 11.30 గంటల సమయంలో లేచి చూడగా భార్య కనిపించలేదు. బాత్‌రూమ్ డోర్ వెనక గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా పలక లేదు. తలుపు తెరిచేందుకు ప్రయత్నింగా వీలు కాలేదు.
పక్క గదిలో ఉన్న వారి సహాయంతో డోర్ పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. లివర్ వ్యాధితో భర్తకు ప్రాణ భయం ఉంటుందేమోనని ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని, సోమవారం రాత్రి దేవున్ని ప్రారి్ధంచిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తరపు బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృత దేహన్ని ఏఐజీ ఆప్పత్రి మార్చురీలో భద్రపరిచారు.