
తిప్పిరి తిరుపతి , మల్లోజుల వేణుగోపాల్
పార్టీ సుప్రీం కమాండర్ మృతితో చర్చ
కేశవరావు తర్వాత పార్టీని నడిపించేది
ఎవరన్న దానిపై ఇంటెలిజెన్స్ నజర్
తెరపైకి తిరుపతి, వేణుగోపాల్, సుజాత పేర్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయి స్టు పార్టీ సుప్రీం కమాండర్, కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో, ఆ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఆ పార్టీ వర్గాలు, సానుభూతిపరుల్లో చర్చ మొదలైంది. మరోవైపు పార్టీకి కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో ఎవరు రావచ్చనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నట్టు సమాచారం.
కేంద్ర కమిటీయే కీలకం..
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 2004లో ఏర్పాటైనప్పుడు కేంద్ర కమిటీలో 32 మంది సభ్యులు ఉండేవారు. అయితే వరుస ఎన్‌కౌంటర్లు, సహజ మరణాల నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలోనే నంబాల కేవశరావు, ప్రయాగ్ మాంఝీ, చలపతి వంటి కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులే ఉన్నట్టు సమాచారం.
2004 నుంచి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోగానే సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) బాధ్యతలు చూస్తున్న నంబాల కేశవరావు పార్టీ చీఫ్‌గా 2018 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో గత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రస్తుతం సీఎంసీ కమాండర్‌గా ఉన్న తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్‌జీకి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదేళ్ల కిందట కూడా ఒకసారి పార్టీ చీఫ్ పదవికి తిరుపతి పేరు తెరపైకి వచి్చంది. అయితే కార్యరూపం దాల్చలేదు.
ఈసారి తెలుగేతర వ్యక్తి?
మరోవైపు కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ (మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు) పేరు కూడా విని్పస్తోంది. పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున మిలిటరీ విభాగం కంటే పొలిట్‌బ్యూరో సభ్యులకే అవకాశం ఇచ్చేందుకు ఆస్కారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వరుసగా రెండుసార్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకే అవకాశం దక్కినందున ఈసారి తెలుగేతర నేతలకు అవకాశం ఇవ్వవచ్చని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజా పేరును పరిశీలనలోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
హిడ్మాకు సీఎంసీ బాధ్యతలు!
గడిచిన దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీకి ఆదివాసీలు.. అందునా మహిళలే దన్నుగా నిలుస్తూ వస్తున్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత జరుగుతున్న భారీ ఎన్‌కౌంటర్లు అన్నింట్లోనూ మహిళా మావోయిస్టులే ఎక్కువగా చనిపోతున్నారు. మావోయిస్టు ఉద్యమంలో మహిళల పోషిస్తున్న భూమికను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రీజనల్ బ్యూరోలో ఉన్న మాధవి అలియాస్ సుజాతకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించవచ్చని, అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు సీఎంసీ బా«ధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమష్టి నాయకత్వం!
పీపుల్స్ వార్ పార్టీలో కొండపల్లి సీతారామయ్య తిరుగులేని విధంగా ఏకఛత్రాధిపత్యం చూపారు. దీన్ని ఇతర పార్టీ నేతలు నిరసించారు. కొండపల్లి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి గతాన్నికి భిన్నంగా ఉమ్మడి నాయకత్వం వైపు మొగ్గు చూపారు. అందువల్లే సెంట్రల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, పొలిటికల్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ వంటివి ఏర్పాడ్డాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సమష్టి నాయకత్వం వైపు మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి కమిటీకి ఒకరికి మించి నాయకులు ఉండే విధానం అవలంబించవచ్చని అంటున్నారు.